Begin typing your search above and press return to search.

మాట మీద కట్టుబడి ఉండేలా 'మాఫీ'పై రేవంత్ పట్టు

ఎన్నికల వేళ పలువురు దేవుళ్ల పేరుతో మొక్కు పెట్టి మరీ.. పంద్రాగస్టు నాటికి రైతు రుణమాఫీని అమలు చేస్తామని చెప్పటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 May 2024 6:16 AM GMT
మాట మీద కట్టుబడి ఉండేలా మాఫీపై రేవంత్ పట్టు
X

మాట ఇవ్వటం ఒక ఎత్తు. దాన్ని నెరవేర్చటం మరో ఎత్తు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఎన్నికల వేళ పలువురు దేవుళ్ల పేరుతో మొక్కు పెట్టి మరీ.. పంద్రాగస్టు నాటికి రైతు రుణమాఫీని అమలు చేస్తామని చెప్పటం తెలిసిందే. ఎన్నికల పర్వంలో కీలకమైన పోలింగ్ ముగిసిన రెండో రోజున అధికారులతో రివ్యూ పెట్టిన ఆయన.. ఎట్టి పరిస్థతుల్లోనూ ఇచ్చిన మాట తప్పకూడదని.. పంద్రాగస్టు నాటికి రుణమాఫీని అమలు చేయాల్సిందేనని తేల్చేశారు.

అందుకు అవసరమైన నిధులను సమీకరించే ప్రయత్నాల్ని పూర్తి చేయాలని ఉన్నతాధికారులకు టార్గెట్లు ఇచ్చేశారు. భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలన్న ముఖ్యమంత్రి రేవంత్.. రుణమాఫీకి సంబంధించి రాజస్థాన్.. మహారాష్ట్ర.. ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాల్ని అధ్యయనం చేయాల్సిందిగా కోరారు.

ఎన్నికల హామీల్లో భాగంగా రైతుల రుణమాఫీపై రేవంత్ పలు ధఫాలుగా హామీలు ఇవ్వటం తెలిసిందే. అయితే.. భారీ మొత్తం అవసరమైన నేపథ్యంలో రుణమాఫీ హామీ అమలు సాధ్యం కాదన్న మాట బలంగా వినిపిస్తోంది. విపక్షాలు సైతం ఇదే అంశాన్ని ప్రచారం చేయటం తెలిసిందే. అయితే.. తాను ఇచ్చిన మాట మీద నిలబడే వాడినన్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేసేందుకు వీలుగా చేతల్లో పనులు షురూ చేశారు రేవంత్.

ఎన్నికల హామీలో భాగంగా రూ.2 లక్షల వరకున్న రుణాన్ని మాఫీ చేస్తామని.. అది కూడా విడతల వారీగా కాకుండా ఏకమొత్తంలో చేస్తామని చెప్పటం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున ఆశలుపెట్టుకున్నారు అన్నదాతలు. ఎన్నికల వేళ పూర్తిగా ప్రచారం.. రాజకీయ అంశాలతో బిజీగా ఉన్న రేవంత్.. ఇప్పుడు పాలన మీద ఫోకస్ పెంచారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూల సంకేతాలు పంపేందుకు వీలుగా.. తన ప్రయారిటీ రుణమాఫీ మీదనే అన్న విషయాన్ని తరచూ చెబుతున్నారు. రేవంత్ చెప్పినట్లుగా రూ.2లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయగలిగితే పెద్ద ఎత్తున మైలేజీ ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.