Begin typing your search above and press return to search.

కింగ్ మేకర్ గా రాయలసీమ ?

ఈసారి ఎన్నికలు విభిన్నంగా జరిగాయి. ఏపీలో ఉన్న సీట్లు 175 అయితే దాన్ని రీజియన్లుగా చూస్తే నాలుగు కీలకమైన ప్రాంతాలుగా చెప్పుకోవాలి.

By:  Tupaki Desk   |   16 May 2024 3:36 AM GMT
కింగ్ మేకర్ గా రాయలసీమ ?
X

ఈసారి ఎన్నికలు విభిన్నంగా జరిగాయి. ఏపీలో ఉన్న సీట్లు 175 అయితే దాన్ని రీజియన్లుగా చూస్తే నాలుగు కీలకమైన ప్రాంతాలుగా చెప్పుకోవాలి. అవి ఉత్తరాంధ్రా జిల్లాలు, మధ్యాంధ్రా జిల్లాలు, దక్షిణ కోస్తా జిల్లాలు, రాయల సీమ జిల్లాలుగా విభజించాల్సి ఉంటుంది.

ఉత్తరాంధ్రా జిల్లాలు 2014లో ఏపీ రాజకీయాలను మలుపు తిప్పాయి. మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో పాతిక సీట్లను టీడీపీ కూటమికి ఆనాడు ఇవ్వడం ద్వారా చంద్రబాబు సీఎం అయ్యేలా చూశాయి. మధ్యాంధ్రా అంటే అచ్చంగా గోదావరి జిల్లాలు. ఈ ప్రాంతాలలో మరో ముప్పయి నాలుగు అసెంబ్లీ సీట్లు ఉంటే వీటిని కూడా 2014లో టీడీపీ ఎక్కువ శాతం గెలుచుకుని అధికారంలోకి సులువుగా రాగలిగింది.

ఇక దక్షిణ కోస్తా జిల్లాలలో గుంటూరు క్రిష్ణా ఆనాడు టీడీపీ కొమ్ము కాస్తే వైసీపీకి నెల్లూరు, ప్రకాశం జిల్లాకు అండగా నిలిచాయి. అంతే కాదు రాయలసీమ జిల్లాలు కూడా వైసీపీ వైపే నిలబడ్డాయి. అదే 2019లో చూస్తే కనుక ఆ రీజియన్ ఈ రీజియన్ అన్న తేడా లేకుండా అన్నీ కూడా వైసీపీకి జై కొట్టాయి.అందుకే 151 సీట్లలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇపుడు 2024 ఎన్నికల్లో ఏమి జరిగింది అన్నదే చర్చగా ముందుకు వస్తోంది.

ఈసారి నెల్లూరు ప్రకాశం జిల్లాలలో టీడీపీ వైసీపీ మధ్య హోరా హోరీ పోరు ఉంది అని అంటున్నారు. అయినా ఒకింత వైసీపీదే ఆధిపత్యం అని అంటున్నారు. గుంటూరు కృష్ణా జిల్లాలలో టీడీపీకి ఆధిపత్యం ఉంటుందని లెక్క వేస్తున్నారు. అయినా 2014 నాటి కంటే వైసీపీ పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది అని అంటున్నారు.

అదే తీరున గోదావరి జిల్లాలను చూస్తే ఇక్కడ టీడీపీ కూటమి ప్రభావం హెచ్చుగా ఉంది అని అంటున్నారు. అయితే వైసీపీ రహిత రాజకీయం మాత్రం జరగదని ఆ పార్టీ తనదైన వాటాను పొందుతుందని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో హోరా హోరీ పోరు సాగుతోంది.

అయితే ఇక్కడ ఉన్న ముప్పయి నాలుగు అసెంబ్లీ సీట్లలో రెండు పార్టీలకు బలం ఉంది. ఎస్టీ సీట్లు కూడా అధికంగా ఉన్నాయి. రెండు ఎస్సీ సీట్లు ఉన్నాయి. ఎస్టీ ఎంపీ సీటు కూడా ఉంది. ఇలా అన్నీ చూసుకుంటే ఉత్తరాంధ్రాలోనూ కొన్ని అటూ ఇటూగా రెండు పార్టీలు పంచుకుంటే అపుడు మ్యాజిక్ ఫిగర్ కి ఎవరు చేరువ కావాలన్నా కీలక తీర్పు ఇచ్చేది రాయలసీమ మాత్రమే అవుతుంది అని అంటున్నారు.

రాయలసీమలో నాలుగు జిల్లాలు ఉన్నాయి. కడప కర్నూలు, అనంతపురం, చిత్తూరు. ఈ నాలుగింటిలో రెండింట వైసీపీకి ఈ రోజుకీ ఆధిక్యత ఉందని అంటున్నారు. అవి కర్నూల్,కడపగా చెబుతున్నారు. ఇక మిగిలింది చిత్తూరు, అనంతపురం. ఇందులో అనంతపురంలో టీడీపీ బలం పుంజుకుందని, అలాగే చిత్తూరులో 2019లో చంద్రబాబు ఒక్కరే గెలిచారు కానీ ఈసారి 14 అసెంబ్లీ సీట్లకు గానూ టీడీపీ తన వాటాను తీసుకుంటుందని అంటున్నారు.

అయితే మొత్తం రాయలసీమలో ఉన్న 52 సీట్లలో మెజారిటీ సీట్లు ఏ పార్టీకి దక్కితే వారే రేపటి ఎన్నికల్లో కింగ్ గా మారే చాన్స్ ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున సీట్లు ఇచ్చే రీజియన్ అయితే ఏపీలో లేదు అని అంటున్నారు. మరి ఈ 52 సీట్లలో ఎవరికి ఎక్కువ దక్కుతాయి అంటే కూటమి పెద్దల నుంచి వస్తున్న జవాబు ఈసారి సీన్ మొత్తం మారింది కాబట్టి టీడీపీ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నారు. అంటే ముప్పయి దాకా కూటమి సీట్లు సాధిస్తుంది అని అంటున్నారు. అదే జరిగితే వైసీపీ ఆశలు గల్లంతు అవుతాయి.

కానీ వైసీపీకి హార్డ్ కోర్ జిల్లాలు గా ఉన్న రాయలసీమలో అలాంటి పరిస్థితి ఎన్నడూ ఉండదని ఎంత తగ్గినా 35 సీట్లకు వైసీపీ తగ్గదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చూడాల్సి ఉంది. ఎందుకంటే ఈ 52 సీట్లలో ఎవరికి 30 నుంచి 35 దాకా వస్తాయో వారికి మ్యాజిక్ ఫిగర్ అయిన 88 నంబర్ ని టచ్ చేయడం చాలా ఈజీ టాస్క్ అవుతుంది అన్నది ఒక విశ్లేషణ. చూడాలి మరి ఏమి జరుగుతుందో.