Begin typing your search above and press return to search.

పెన్షనర్ల వేదనలు రోదనలు...కొంప ముంచడం ఖాయం !

ఇక బ్యాంకులలో పెద్ద సంఖ్యలో వృద్ధులు చేరి పడిగాపులు పడుతున్న దృశ్యాలు అంతటా కనిపిస్తున్నాయి. తెల్లారుతూనే బ్యాకుల వద్ద క్యూ కడుతున్నారు.

By:  Tupaki Desk   |   2 May 2024 10:11 AM GMT
పెన్షనర్ల వేదనలు రోదనలు...కొంప ముంచడం ఖాయం !
X

పండుటాకులు వారంతా. ఈ నెల పెన్షన్ తీసుకుంటే వచ్చే నెలకు గ్యారంటీగా అందుకుంటామన్న ఆశ లేని వారు అంతా ఎనభైలు దాటిన కురు వృద్ధులు. కడుపులో చల్ల కదలకుండా హాయింగా ఇంటి వద్దనే ఉంటూ పొద్దు పొద్దున్నే పెన్షన్ వాలంటీర్ల ద్వారా అందుకునే జీవితం వారిది. ఇలా అయిదేళ్ళ కాలం హాయిగా గడచింది.

అయితే ఎన్నికలు వచ్చాయని ఎన్నికల కోడ్ అమలు లో ఉందని ఏకంగా బ్రహ్మాస్త్రాన్ని తెచ్చి మూలన ఉన్న ముసలమ్మ మీద ప్రయోగించినట్లుగా వృద్ధుల మీద పెద్దలు బాణం వేశారు. వారి వద్దకు వాలంటీర్లు వెళ్లరాదని డిమాండ్ చేస్తూ వచ్చాయి. దీని మీద మేధావుల ఫోరం అంటూ కొందరు కలసి ఈసీకి ఫిర్యాదు చేయడంతో వాలంటీర్లు మూడు నెలల పాటు విధులకు దూరం కావాల్సి వచ్చింది.

సరే వాలంటీర్లు దూరం పెట్టారు. కానీ వృద్ధులను ఇబ్బంది పెడుతున్నామన్న ఆలోచన టీడీపీ కూటమి పెద్దల డిమాండ్ వెనక లేకపోవడమే ఇంతటి విషాద పరిస్థితికి కారణం. ఏప్రిల్ నెలలో సచివాలయాల వద్ద వృద్ధులకు పెన్షన్లు ఇచ్చారు. అయితే ఆ ఎండలకే ముప్పయి మందికి పైగా మరణించారని వార్తలు వచ్చాయి.

ఇపుడు చూస్తే గడ్డు వేసవి. మే నెల ఎండలు ఈ సమయంలో వృద్ధుల్లో దాదాపుగా అరకోటి మందికి పైగా బ్యాంక్ ఖాతాలలో నగదు జమ చేస్తున్నారు. అయితే బ్యాంక్ ఖాతాలు లేని వారి సంగతి ఏమిటి అన్నది ఒక ప్రశ్న అయితే ఖాతాలు ఉండి వాటికి యాక్టివ్ మోడ్ లో ఉంచుకోని వారి పరిస్థితి ఏమిటి అన్నది మరో ప్రశ్న.

యాక్టివ్ గా ఖాతాలు ఉంచకపోతే పెనాల్టీని బ్యాంకులు వేస్తాయి. అదే విధంగా కనీస బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోయినా అపరాధ రుసుం తీసుకుంటారు. దీంతో రెండిందాలా వృద్ధులకు వచ్చే ఆ పెన్షన్ మొత్తంలో నుంచి కన్నాలు పడడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక బ్యాంకులలో పెద్ద సంఖ్యలో వృద్ధులు చేరి పడిగాపులు పడుతున్న దృశ్యాలు అంతటా కనిపిస్తున్నాయి. తెల్లారుతూనే బ్యాకుల వద్ద క్యూ కడుతున్నారు. ఏ వేళకు అయినా పెన్షన్ మొత్తం చేతిలో పడితే దానితో జీవితాలు గడుస్తాయన్న బాధ వారిది. దాంతో బ్యాకుల వద్ద ఇపుడు పెన్షనర్లతో పెద్ద క్యూ కనిపిస్తోంది.

తెల్లారుతూనే భానుడు భగభగలాడించే పరిస్థితులలో వృద్ధులు అలా గంటల తరబడి బ్యాకుల ముందు క్యూ కట్టడం అంటే వారు పెన్షన్ కోసం జీవితాలనే ఫణంగా పెడుతున్నారు అనుకోవాల్సిందే. పగటి ఉష్ణోగ్రతలు నలభై అయిదు పై దాటి ఉన్నాయి. అధిక వేడిమి ఉక్కబోతతో అంతా సతమతమవుతూ ఇళ్లలో ఉండాల్సిన సమయంలో పెన్షన్ పేరుతో వృద్ధులు ఇలా బ్యాంకుల చుట్టూ క్యూ కట్టడం చూసిన వారు ఈ పాపం ఎవరిది అన్న ప్రశ్ననే వేస్తున్నారు.

టీడీపీ జనసేన కూటమి పెద్దల డిమాండ్ చేసి మరీ ఈ విధంగా ఇళ్లలోని వృద్ధులను మే ఎండలలో రోడ్ల పైకి తీసుకుని వచ్చాయని కూడా అంటున్నారు. వృద్ధుల సామాజిక పెన్షన్ మొత్తాన్ని మేము అధికారంలోకి వస్తే పెంచుతామని చెబుతున్న విపక్షం అందులో వేయవ వంతు కరుణ అయినా చూపించి ఉంటే ఇపుడు వృద్ధులకు బయటకు వచ్చి ఎండలో క్యూలు కట్టే తిప్పలు తప్పేవి కదా అని కూడా అంటున్నారు.

అయిదేళ్ల పాటు సాఫీగా సాగిన ఒక వ్యవస్థను బ్రేకు చేసి పండుటాకులను అవస్థలకు గురి చేయడం వల్ల రాజకీయ లాభం కంటే నష్టమే జరిగిందని అంటున్నారు. వృద్ధులు విపక్షాల మీదే మండిపోతున్నారు. మాకు ఇంతటి పరిస్థితి తెచ్చినది టీడీపీ జనసేన రాజకీయమే అని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వారి వేదనలు రోదనలు ప్రతీ బ్యాంక్ ముంగిట కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి. దాంతో ఆ కన్నీటి ప్రవాహం కొంప ముంచడం ఖాయమన్న కలవరం అయితే విపక్ష శిబిరంలో మొదలైంది అని అంటున్నారు. ఇక 66 లక్షల మందికి ఒకేసారి ఒకే రోజున ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే పరిస్థితి కానీ వ్యవస్థ కానీ లేదని తెలిసి కూడా ఈ తరహా దారుణమైన డిమాండ్లతో విపక్షాలు వీరంగం చేయడం వల్లనే ఈ దుస్థితి అని అంటున్నారు.

ఎక్కడైనా రాజకీయం రాజకీయంగానే చేయాలి. ప్రత్యర్ధులను ఎదుర్కోవడానికి సవా లక్ష మార్గాలు ఉన్నాయి. అనేక బాణాలు ఉన్నాయి.కానీ పోయి పోయి మూలనున్న ముసలమ్మను ముసలయ్యలను కొడితే ఆ పర్యవసానాలు ఫలితాలు ఎలా ఉంటాయో అన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఏది ఏమైనా రాజకీయాలలో వికృత తత్వం పరాకాష్టకు చేరుతోంది అనడానికి పండుటాకులు మే ఎండలలో ఆరు బయటకు వచ్చి బతుకు పోరాటం చేయడమే అతి పెద్ద ఉదాహరణ అని అంటున్నారు. దీనికి మూల్యం తెలుగుదేశం కూటమి చెల్లించుకునే సందర్భం వస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు.