Begin typing your search above and press return to search.

ట్యాక్సుల‌పై నిర్మల‌మ్మకు డైరెక్ట్ బిగ్ పంచ్... వీడియో వైర‌ల్!

భారతదేశంలో ట్యాక్స్ పేయర్స్ జనాభాకు తగిన స్థాయిలో ఉండరనే చర్చ బలంగా వినిపిస్తుంటుంది.

By:  Tupaki Desk   |   16 May 2024 11:14 AM GMT
ట్యాక్సుల‌పై నిర్మల‌మ్మకు డైరెక్ట్  బిగ్  పంచ్... వీడియో వైర‌ల్!
X

భారతదేశంలో ట్యాక్స్ పేయర్స్ జనాభాకు తగిన స్థాయిలో ఉండరనే చర్చ బలంగా వినిపిస్తుంటుంది. ట్యాక్స్ పే చేసే విషయంలో భారతీయులు పూర్తిగా దాటవేత ధోరణి, నిర్లక్ష్యం వహిస్తుంటారనే కామెంట్లూ అక్కడక్కడా వినిపిస్తుంటాయి. అదే కారణమో ఏమో కానీ... "ఒకే దేశం - ఒకే పన్ను" అంటూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ జీఎస్టీ ని తీసుకొచ్చింది.

దానికి 101వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద రాజ్యాంగ చట్టం 2016గా ప్రవేశపెట్టారు. జీఎస్టీ కౌన్సిల్, దాని ఛైర్మన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వస్తు సేవల పన్నును పరిపాలిస్తారు. అయితే ఈ విధానంపై రకరాకాల విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇది సామాన్యుల పాలిట గుదిబండగా మారిందనే కామెంట్లు బలంగా వినిపించేవి.

ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ ఇంట్రాక్షన్ లో భాగంగా.. ఆ వ్యక్తి వేసిన ప్రశ్నలు వింటే.. నిజమేననిపిస్తోంది. ఈ సందర్భంగా... ట్యాక్సులు కట్టేది, రిస్క్ చేసిది తాను అని చెబుతూ.. ఏ పెట్టుబడీ పెట్టని కేంద్రాన్ని స్లీపింగ్ పార్ట్నర్ గా అభివర్ణించడం వైరల్ గా మారింది.

ఇందులో భాగంగా... స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాలపై భారీ పన్నులు విధిస్తూ కేంద్రం దండిగా అర్జిస్తోంది కానీ... ఇన్వెస్టర్లు మాత్రం లాభం వస్తుందో నష్టం వస్తుందో కూడా తెలియకుండా పన్నులు మాత్రం చెల్లిస్తున్నారని సదరు వ్యక్తి తెలిపారు. ఈ విషయంలో కేంద్రం ఒకరకంగా స్లీపింగ్ పార్ట్నర్ లా వ్యవహరిస్తోందని ఆవేదన వెళ్లగక్కుతూ చురకలంటించాడు. ఇదే సమయంలో ముంబైలో ఇళ్లు కొనాలంటే సామాన్యుడికి పడుతున్న "పన్ను"పోటులపైనా స్పందించాడు.

ఇందులో భాగంగా... ఎక్కడైనా ఇల్లు కొనుకోవాలనుకుంటే నగదు లావాదేవీలు సాధ్యపడటం లేదు. తమ దగ్గరనున్న వైట్ మనీ అన్ని ట్యాక్స్ లకు వెళ్ళగా, ఏదైనా కొనాలన్న పన్నుల మీద పన్నులు విధిస్తున్నారని, జీఎస్టీ వలన తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. దీంతో అక్కడునన్వారంతా చప్పట్లు కొడుతూ, అతడు సంధించిన ప్రశ్నలపట్ల హర్షం వ్యక్తం చేశారు.

అయితే ఇంత సీరియస్ విషయానికి సమాధానంగా స్పందించిన నిర్మలా సీతారామన్... "స్లీపింగ్ పార్ట్నర్లు సమాధానం ఏమి చెబుతారు?" అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో అక్కడున్న వారంతా ఆమె సమాధానం విని విస్తుపోగా... ఆన్ లైన్ లో మాత్రం నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. అదో తెలివైన సమాధానం అని నిర్మలా సీతారామన్ భావిస్తున్నారేమో.. జనం మాత్రం చేతకానితనంగా భావిస్తున్నారంటూ ఫైరవుతున్నారు!!