Begin typing your search above and press return to search.

మరోసారి... నల్లధనం ప్రజలకు పంచుతానంటున్న మోడీ!

ఎన్నికలు సమయంలో నల్లధనం, పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశం కచ్చితంగా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతుందనే కామెంట్ బలంగా వినిపిస్తుంటుంది.

By:  Tupaki Desk   |   17 May 2024 7:18 AM GMT
మరోసారి... నల్లధనం ప్రజలకు  పంచుతానంటున్న మోడీ!
X

ఎన్నికలు సమయంలో నల్లధనం, పాక్ ఆక్రమిత కశ్మీర్ అంశం కచ్చితంగా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతుందనే కామెంట్ బలంగా వినిపిస్తుంటుంది. ఆ సంగతి అలా ఉంటే... అవినీతి కేసుల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంటున్న నోట్ల కట్టల గుట్టలపై ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ఎన్నికల వేళ కచ్చితంగా విదేశాల్లో ఉన్న నల్లధనం పేదలకు పంచడం అనే విషయాన్ని మోడీ & కో హైలైట్ చేస్తారనే విషయంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో మరోసారి ఈ విషయంపై మోడీ స్పందించారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందించిన మోడీ... కాంగ్రెస్‌ హయాంలో ఈడీ నిరుపయోగంగా ఉండిపోయిందని అన్నారు.

ఇదే క్రమంలో... తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే కేంద్ర దర్యాప్తు సంస్థలు సమర్థంగా పనిచేయడం ప్రారంభించిందని తెలిపిన మోడీ... అవినీతి కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకుంటున్న నోట్ల గుట్టలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఆ సొమ్మును పేదలకు తిరిగి పంచే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన ప్రధాని... గత ప్రభుత్వాల హయాంలో కొందరు వ్యక్తులు అధికార బలంతో తమ పదవులను దుర్వినియోగం చేసి పేదల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బంతా తిరిగి పేదలకు చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దీనికోసం న్యాయబృందం సలహా కోరుతామని.. చట్టపరంగా మార్పులు చేయాల్సి వస్తే దానికీ వెనుకాడబోమని చెప్పుకొచ్చారు.

ఇదే క్రమంలో... ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధిస్తుందంటూ బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న విషయాన్ని ప్రస్థావించిన మోడీ... 400 సీట్లు గెలుస్తామని ప్రజలే తమలో విశ్వాసం నింపారని అన్నారు. వాళ్ల దృక్పథం తనకు తెలుసని.. 2019 ఎన్నికల నుంచే తమ కూటమికి 400 స్థానాల మెజార్టీ ఉందని.. ఈసారి 400 మార్క్‌ దాటాలని తమ నేతలకు చెప్పామని తెలిపారు.