Begin typing your search above and press return to search.

నాగబాబుకు ఈసీ మార్క్ షాక్!

ఎవరికీ తట్టని విషయాలను తన ఊహలను ఏదో జరిగిపోతోంది అన్న అందోళలనను కలిగించడం అన్నది రాజకీయ నేతలకు పరిపాటే.

By:  Tupaki Desk   |   12 May 2024 9:45 AM GMT
నాగబాబుకు ఈసీ మార్క్ షాక్!
X

ఎవరికీ తట్టని విషయాలను తన ఊహలను ఏదో జరిగిపోతోంది అన్న అందోళలనను కలిగించడం అన్నది రాజకీయ నేతలకు పరిపాటే. అయితే అది శృతి మించితే అతిగా మారితేనే షాక్ కొడుతుంది. జనసేన నేత నాగబాబు కూడా క్యాడర్ ని అలెర్ట్ చేసే క్రమంలో ఒక తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం పట్ల ఎన్నికల సంఘం ఘాటుగానే రియాక్ట్ అయింది. దయచేసి ఎన్నికల గురించి మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలి అంటూ నాగబాబు ట్వీట్ ను కోట్ చేస్తూ మరీ ఎన్నికల సంఘం గట్టిగానే హెచ్చరించింది.

ఇంతకీ నాగబాబు ఏమన్నారు అంటే ఆయన ఒక వీడియో బైట్ ని తాజాగా విడుదల చేశారు. అందులో ఓటర్లను ఎన్నికలకు దూరం చేసేందుకు వైసీపీ గూండాలు రౌడీలు సన్నాసులు కొత్త ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

ఓటర్లను వారు కలసి డబ్బులు పంచుతూ వారి చేతికి ఒక చెరగని సిరాను వేస్తున్నారని దాని ఫలితంగా వారు ఓటింగుకే పూర్తిగా దూరం ఉండాలని అలా వారిని పెట్టాలని ఒక కుటిల ప్రయత్నం చేస్తున్నారు అంటూ నాగబాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఆ వీడియో బైట్ లో మండిపడ్డారు.

అయితే నాగబాబు ఆరోపణలు అన్నీ తప్పుడు తడక అని ఎన్నికల సంఘం తేల్చేసింది. దీనిపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ ఈ ఆరోపణలు నిజం కావని వీడియో సందేశంలో స్పష్టం చేశారని కూడా ఏపీ సీఈవో కార్యాలయం పేర్కొంది.

అంతే కాదు భారత ఎన్నికల సంఘం నియమించిన అధికారులు మాత్రమే చెరగని సిరాను వాడే అధికారం కలిగి ఉన్నారని స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ పేరుతో నాగబాబు వీడియో స్క్రీన్ షాట్ ను జత చేసి ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.

అందులో ఎవరైనా సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసే ముందు అది నిజమో, కాదో ప్రతి ఒక్కరూ సరిచూసుకోవాలని సూచించింది. వెరిఫై బిఫోర్ యూ యాంప్లిఫై, కాంబాట్ మిస్ ఇన్ఫర్మేషన్ అనే హ్యాష్ ట్యాగ్ లను తమ పోస్ట్ కు జత చేసింది.దీంతో నాగబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెబుతూనే ఒక విధంగా ప్రజలకు కూడా వివరణ ఇచ్చింది.

నిజానికి కేంద్ర ఎన్నికల సంఘం వద్దనే చెరని సిరా ఉంటుంది. ఒక వ్యక్తి ఓటు వేసిన తరువాత కనీసం పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల దాకా ఆ సిరా అలాగే వేలికి ఉంటుంది. ఆయన మరోసారి ఓటు వేయకుండా నిరోధించేందుకే ఈ విధానం ఎప్పటి నుంచో అమలు చేస్తున్నారు. దేశంలో ఇప్పటికి రెండు పదులకు దగ్గరగా లోక్ సభ ఎన్నికలు జరిగినా పదుల సంఖ్యలో అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా అలాగే లోకల్ బాడీ ఎన్నికలు జరిగినా కూడా చెరగని సిరాను ఎవరూ ప్రలోభాలకు వాడలేదు. అసలు ఆ ఆలోచన కూడా తట్టలేదు.

ఆ సిరా ఎలా తయారు చేస్తారు దాని కోసం ఏ కాంబినేషన్లు వాడుతారు అన్నది కూడా ఈసీ ఒక సీక్రెట్ నే మెయిన్ టెయిన్ చేస్తూ వస్తోంది. మరి నాగబాబుకు ఎవరైనా అలా జరుగుతోందని చెప్పారా ఒక వేళ చెబితే ఆయన నమ్మేసి దానిని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం వెనక ముందూ ఆలోచించుకోకుండా వైరల్ చేయాలని చూడడం పట్ల ఈసీ సీరియస్ గానే రియాక్ట్ అయింది.

వాస్తవానికి ప్రతీ ఎన్నికకూ కొన్ని కొత్త పద్ధతులను తీసుకుని రావడం ద్వారా ప్రజా స్వామ్యాన్ని పటిష్టంగా చేయాలని ఈసీ ఆలోచిస్తూ ఉంటుంది. బూత్ కాప్చ రింగులు లేదా ఇతర దాడులు అన్నవి అంతకంతకు తగ్గించాలని చూస్తోంది. ఈ క్రమంలో నాగబాబు లేవనెత్తిన పాయింట్ పూర్తిగా ఊహాజనితంగా ఉందని మేధావులు అంటున్నారు. ఈ తరహా ప్రచారాల వల్ల ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే వారికే మేలు జరుగుతుంది తప్ప మరోటి కాదని కూడా అంటున్నారు.