Begin typing your search above and press return to search.

టాప్ ర్యాంకర్ నే టార్గెట్ చేశారు

అందుకే అనన్యరెడ్డి ర్యాంకు సాధించిన తర్వాత అందరూ ఆమె సోషల్ మీడియా ఖాతాలను వెతకడంలో బిజీ అయ్యారు.

By:  Tupaki Desk   |   2 May 2024 10:30 AM GMT
టాప్ ర్యాంకర్ నే టార్గెట్ చేశారు
X

ఇటీవల వెల్లడైన యూపీఎస్సీ ఫలితాలలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్యరెడ్డి జాతీయ స్థాయిలో మొదటి ప్రయత్నంలోనే మూడవ ర్యాంకును సాధించిన విషయం తెలిసిందే. సాధారణ వ్యక్తిగా ఉన్న ఆమె యూపీఎస్సీ ఫలితాల తర్వాత సెలబ్రిటీగా మారిపోయారు. ప్రస్తుత ప్రపంచంలో సోషల్ మీడియాకు ఉన్న ఆకర్షణ అందరికీ విదితమే. అందుకే అనన్యరెడ్డి ర్యాంకు సాధించిన తర్వాత అందరూ ఆమె సోషల్ మీడియా ఖాతాలను వెతకడంలో బిజీ అయ్యారు.

సరిగ్గా దీనినే సైబర్ కేటుగాళ్లు ఆసరాగా తీసుకున్నారు. ఆమెకు సంబంధం లేకుండానే ఆమె పేరు మీద సోషల్ మీడియాలోని ఇన్ స్టా, టెలిగ్రామ్, ఫేస్ బుక్, ఎక్స్ ప్లాట్ ఫామ్ లలో ఖాతాలు తెరిచారు. ఫేక్ ప్రొఫైల్స్ మెయింటెయిన్ చేస్తూ నిజమైన అనన్యరెడ్డి ఖాతాగా భ్రమింపచేస్తున్నారు. నిజంగా ఆ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ఆమెవే అని నమ్మి ఫాలో అవుతున్నారు.

ఇలా గుడ్డిగా ఫాలో అవుతున్న వారితో సైబర్ నేరగాళ్లు డబ్బులు లాక్కునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏకంగా టెలిగ్రామ్ లో అనన్య రెడ్డి మెంటల్ షిప్ ప్రోగ్రాం అంటూ సివిల్స్‎కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే నిర్దిష్ట నగదును సైతం తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఈ వ్యవహారంపై సీరియస్ గా స్పందించిన అనన్యరెడ్డి పోలీసులను ఆశ్రయించింది.

తాను ఎక్కడా ఎలాంటి ప్రోగ్రామ్స్‎లో పాలు పంచుకోవడంలేదని, ఎవరికైనా ఫేక్ ప్రొఫైల్స్ కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయాల్సిందిగా ఆమె కోరుతున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సైబర్ క్రైమ్ ఏసీపీ రవీంద్రారెడ్డి తెలిపారు.