Begin typing your search above and press return to search.

వీడియో... కాంగ్రెస్ కోసం వెంకటేష్ పెద్ద కూతురు ప్రచారం!

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాపెయినర్లను రంగంలోకి దించుతుందంటూ గతకొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.

By:  Tupaki Desk   |   1 May 2024 10:42 AM GMT
వీడియో... కాంగ్రెస్ కోసం వెంకటేష్ పెద్ద కూతురు ప్రచారం!
X

ప్రస్తుతం తెలంగాణలోనూ లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. వచ్చే నెల 13న పోలింగ్ జరగనుండగా.. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి.. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాపెయినర్లను రంగంలోకి దించుతుందంటూ గతకొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.

ఇందులో భాగంగా.. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ లోక్‌ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామసహాయం రఘురాంరెడ్డి తరుపున ప్రచారం కోసం అనూహ్యంగా సరికొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో... ఖమ్మం లోక్ సభ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరుపున హీరో విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత ఎన్నికల ప్రచారంలోకి దిగారు.

అవును... ఖమ్మం లోక్ సభ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరుపున వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత ఎన్నికల ప్రచారంలోకి దిగారు. తన మామ, ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి తరుపున ఆమె ప్రచారం చేశారు. ఇందులో భాగంగా.. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు!

ఈ క్రమంలో మైకందుకున్న అశ్రిత... రఘురామ రెడ్డి గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధికి ఏ చేస్తారనేది వివరించారు. మే 13న జరగనున్న ఎన్నికలో మనం అంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మన రఘురామ రెడ్డిని గెలిపిద్దాం అని ఆమె ప్రచారం చేశారు. ఇదే సమయంలో... గత ఐదేళ్లలో ఏం చేశారో నామా నాగేశ్వరరావు చెప్పాలని డిమాండ్ చేశారు.

కాగా... హీరో వెంకటేష్‌ కుమార్తె అశ్రితను రఘురాంరెడ్డి పెద్ద కుమారుడు వినాయక్‌ రెడ్డి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో.. తన మామ కోసం అశ్రిత ప్రచారం చేపట్టారు. ఇదే సమయంలో... వియ్యంకుడి గెలుపు కోసం వెంకటేష్ కూడా బరిలోకి దిగుతున్నట్లు సమాచారం. మే 7న ఖమ్మంలో వెంకటేష్‌ తో ప్రచారం చేసేందుకు షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి!