Begin typing your search above and press return to search.

మొన్నటిదాకా అనావృష్టి.. ఇప్పుడు అతివృష్టి

ఇలా వారాలకు వారాలను ఖాళీగా వదిలేసిన నిర్మాతలు.. మే తొలి వీకెండ్‌లో మాత్రం పోటీకి సై అంటే సై అనేస్తున్నారు.

By:  Tupaki Desk   |   1 May 2024 11:30 PM GMT
మొన్నటిదాకా అనావృష్టి.. ఇప్పుడు అతివృష్టి
X

బాక్సాఫీస్‌లో ఒక్కోసారి ఒక్కో రకమైన పరిస్థితి ఎదురవుతుంటుంది. కొన్నిసార్లు ప్రేక్షకులు సినిమాల కోసం ఎదురు చూస్తున్నా సరే ఆశించిన స్థాయిలో కొత్త చిత్రాలు ఉండవు. వీకెండ్లకు వీకెండ్లను ఖాళీగా వదిలేస్తుంటారు. కానీ ఒక్కోసారి అవసరానికి మించి సినిమాలను వదిలేస్తుంటారు. తీవ్రమైన పోటీలో ఎవరికి వాళ్లు తగ్గనంటూ రంగంలోకి దిగిపోతుంటారు.

ఏప్రిల్ నెల తొలి వారంలో ఫ్యామిలీ స్టార్ లాంటి క్రేజీ మూవీ రిలీజ్ కాగా.. తర్వాతి వారాల్లో అసలు పోటీయే లేదు. రెండో వారానికి గీతాంజలి మళ్లీ వచ్చింది అనే చిన్న సినిమానే చెప్పుకోదగ్గ రిలీజ్ అయింది. తర్వాతి రెండు వారాల్లో పారిజాత పర్వం, రత్నం మినహా చెప్పుకోదగ్గ రిలీజ్‌లే లేకపోయాయి. గత వారం కనీసం ఒక్క తెలుగు చిత్రం కూడా విడుదల కాలేదు. ఇలా వారాలకు వారాలను ఖాళీగా వదిలేసిన నిర్మాతలు.. మే తొలి వీకెండ్‌లో మాత్రం పోటీకి సై అంటే సై అనేస్తున్నారు.

ఈ వారాంతంలో ఏకంగా ఐదు కొత్త రిలీజ్‌లు ఉన్నాయి. ముందు వారాల్లో రావాల్సిన ఆ ఒక్కటి అడక్కు, బాక్ (తమిళ అనువాద చిత్రం) ఈ వారానికే షెడ్యూల్ అయ్యాయి. ఇక ఆల్రెడీ మే 3కు ఫిక్స్ అయిన ప్రసన్న వదనం ఉండనే ఉంది. దీనికి తోడు శబరి, జితేందర్ రెడ్డి అనే రెండు ఇంట్రెస్టింగ్ మూవీస్ కూడా ఈ వారం రాబోతున్నాయి.

ఐతే తర్వాతి వారానికి పెద్దగా సినిమాలు లేని నేపథ్యంలో వీటిలో ఒకటో రెండో తర్వాతి వారం రిలీజ్ చేస్తే బాగుండేదమో. ఈ వారానికి మాత్రం ప్రేక్షకులకు ఎక్కువ ఆప్షన్లే ఉన్నాయి. ఈ పోటీ వల్ల ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తున్నప్పటికీ శబరి, జితేందర్ రెడ్డి చిత్రాల మీద ప్రేక్షకుల చూపు పడడం సందేహమే. ఐతే గత కొన్ని వారాలుగా డల్లుగా సాగుతున్న బాక్సాఫీస్‌లో ఆ ఒక్కటి అడక్కు, ప్రసన్న వదనం లాంటి చిత్రాలు కొంత ఊపు తీసుకొస్తాయని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి.