తుపాకి గైడ్: ఎక్కడికెళితే ఫ్రీగా స్నానం చేసుకోవచ్చు?

Sun Jul 19 2015 14:46:20 GMT+0530 (IST)

పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల సందర్భంగా నదీస్నానం చేయాలని భక్తులు ఉత్సాహం చూపిస్తారు.. అలాంటిది 144 ఏళ్ల తరువాత వచ్చిన గోదావరి మహాపుష్కరాలపై భక్తులు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. వారూవీరు అన్న తేడా లేకుండా ప్రజలంతా గోదావరికే వరుసకడుతున్నారు. అయితే... రెండు తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఎక్కడెక్కడ ప్రవహిస్తోంది.... హైదరాబాద్ వంటి ప్రధాన నగరానికి ఏ తీరం ఎంత దూరంలో ఉందన్నది తెలిస్తే పుష్కర స్నానానికి ప్రయాణం కొంత తేలికవుతుంది.
    
    తెలంగాణ రాష్ట్రంలో అయిదు జిల్లాల్లో గోదావరి నది ప్రవహిస్తోంది. ఆయా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ఘాట్ లు నిర్మించి పుష్కర స్నానమాచరించడానికి వీలుగా సౌకర్యాలు కల్పించింది.

ఆదిలాబాద్ జిల్లాలో:

- బాసర: ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి ఆలయం ఉన్న పుణ్యక్షేత్రం. ఇది హైదరాబాద్ కు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు రైలు మార్గాల్లో ఇక్కడకు చేరుకోవడం సులభమే. ఇక్కడ గోదావరిలో నీరు తక్కువగా ఉంది.
- నిర్మల్: హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. 222 కిలోమీటర్ల దూరం. గోదావరిలో నీరు అంతంతమాత్రం.
- మంచిర్యాల: ఇది హైదరాబాద్ కు 228 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ గోదావరిలో నీరుంది.
- ఇవి కాకుండా ముథోల్ వస్తాపూర్ లోకేశ్వరం సోన్ ఖానాపూర్ చింతగూడ జన్నారం సీతారాంపల్లి ముల్కల లక్సెట్టిపేట్ దండేపల్లి వెల్లాల జైపూర్ చెన్నూర్ చింతలచాంద లక్ష్మణచాంద సాంగ్వి దిల్వార్ పూర్ మామడలోనూ గోదావరి ప్రవహిస్తోంది.

కరీంనగర్ జిల్లాలో..

- ధర్మపురి: హైదరాబాద్ నుంచి 232 కిలోమీటర్ల దూరం. ఇక్కడ ప్రఖ్యాత లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. గోదావరిలో నీరులేదు.
- కాళేశ్వరం: ముక్తేశ్వర స్వామి ఆలయం ఉన్న కాళేశ్వరం హైదరాబాద్ కు 260 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోదావరిలో ఇక్కడ నీరు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంది. కాళేశ్వరం వద్ద గోదావరిలో ప్రాణహిత నది కూడా కలుస్తుంది. అంతర్వాహినిగా సరస్వతి నది ఉంటుంది. కాబట్టి ఇది త్రివేణి సంగమం. ప్రశస్తమైన క్షేత్రం. ఇక్కడ పుష్కర స్నానం మరింత పుణ్యదాయకం.
- గోదావరిఖని: హైదరాబాద్ కు 225 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోదావరిలో నీరున్నాయి. గోదావరి ఖని కార్పొరేషన్ కావడం... సహజంగానే సౌకర్యాలు ఉండడం.. రోడ్డుమార్గంలోనూ మంచి కనెక్టివిటీ ఉండడం ప్లస్ పాయింట్లు గోదావరిఖని జంటపట్టణమైన రామగుండంలో రైల్వే స్టేషన్ ఉంది.
- ఇవి కాకుండా ధర్మపురి సమీపంలోని తిమ్మాపూర్ వెల్గటూరు మండలంలోని కోటిలింగాల... మంథని ఇబ్రహీంపట్నం మల్లాపూర్ రాయికల్ లోని బొర్నపల్లి సారంగపూర్ ఇబ్రహీంపట్నంలోని పలు గ్రామాల్లో గోదావరి ప్రవహిస్తోంది. కరీంనగర్ జిల్లాలోని మొత్తం పది మండలాల్లో గోదావరి ప్రవహిస్తోంది. ఇవన్నీ దాదాపు ఒకే దూరంలో ఉంటాయి. ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మండలాల్లోని ఎక్కువ గ్రామాల్లో గోదావరి ఉంది.

నిజామాబాద్ జిల్లా:

నిజామాబాద్ జిల్లా కేంద్రం హైదరాబాద్ కు 175 కిలోమీటర్ల దూరంలో ఉంది.
- కందకుర్తి: నిజామాబాద్ జిల్లాలో కందకుర్తి ప్రధానమైన గోదావరి పరివాహక ప్రాంతం. ఇది హైదరాబాద్ కు 206 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కూడా త్రివేణి సంగమం.
- నవీపేట్: ఇది నిజామాబాద్ కు సమీపంలో బాసర మార్గంలో ఉంది. హైదరాబాద్ కు 195 కిలోమీటర్ల దూరం. నీరు తక్కువగానే ఉంది.
- పోచంపాడు: హైదరాబాద్ కు 210 కిలోమీటర్ల దూరం. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రాంతం కావడంతో నీరుంది.
- నందిపేట్: హైదరాబాద్ కు 196 కిలోమీటర్ల దూరం. నీరుంది.
- ఇవి కాకుండా నవీపేట్ నందిపేట్ మోర్తాడ్ బాల్కొండ మండలాల్లోని తడబిలోలి తుంగిని తడపకల్ తదితర గ్రామాల్లో గోదావరి ప్రవహిస్తోంది. ఆయా గ్రామల్లో స్తానికంగా చిన్నచిన్న ఆలయాలున్నాయి.
- ప్రధాన ఆలయాలు ఉన్న తీరాల్లోనే స్నానాలు చేయాలన్న ఉద్దేశం వీడితే నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్ నందిపేట్ మోర్తాడ్ బాల్కొండ మండలాల్లోని గోదావరి తీరాలకు వెళ్లడం అత్యంత ఉత్తమం.

వరంగల్ జిల్లా..

- ఏటూరునాగారంలోని మల్లకట్ట రామన్నగూడెం... మంగన్నగూడెంల్లో గోదావరి ప్రవహిస్తోంది. ఇవన్నీ హైదరాబాద్ కు 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటాయి.

ఖమ్మం జిల్లా...

- భద్రాచలం: హైదరాబాద్ కు 320 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలుమార్గం ఉన్నా ఫ్రీక్వెన్సీ తక్కువ. రోడ్డు మార్గంలో వెళ్లడమే సౌకర్యం. ఉభయరాష్ట్రాల్లోకెల్లా ప్రసిద్ధమైన రామాలయం ఇక్కడే ఉంది. గోదావరిలో పుష్కలంగా నీరుంది.
- దుమ్ముగూడెం పర్ణశాల రామచంద్రాపురం మణుగూరు ప్రాంతాల్లోనూ గోదావరి ప్రవహిస్తోంది. ఇవన్నీ 320 కిలోమీటర్లకంటే ఎక్కువ దూరంలోనే ఉన్నాయి. అంతటా గోదావరిలో నీరుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...

ఆంధ్రప్రదేశ్ లో గోదావరి కేవలం రెండు జిల్లాల మీదుగానే ప్రవహిస్తోంది. గోదావరికి ఒకవైపున పశ్చిమగోదావరి.. రెండో వైపున తూర్పుగోదావరి జిల్లాలున్నాయి. పశ్చిమలో కొవ్వూరు తూర్పులో రాజమండ్రి ప్రధాన తీరాలు. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి తీరాలన్నిట్లోనూ పుష్కలంగా నీరుంది. సౌకర్యాలు ఏర్పాట్లూ ఘనంగా ఉన్నాయి.

తూర్పుగోదావరి జిల్లాలో..

- రాజమండ్రి: హైదరాబాద్ కు 430 కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలుమార్గంలోనూ ఇది మంచి రవాణా సౌకర్యం ఉన్న నగరం. రాజమండ్రిలో కోటిలింగాల రేవు పుష్కరఘాట్ మార్కండేయ ఘాట్ గౌతమి ఘాట్ ప్రధానమైనవి.
- ధవళేశ్వరం: హైదరాబాద్ కు రోడ్డు మార్గంలో సుమారు 425 కిలోమీటర్ల దూరంలో ఉంది.
- కోటిపల్లి: హైదరాబాద్ కు 470 కిలోమీటర్ల దూరం
- అంతర్వేది: హైదరాబాద్ కు 463 కిలోమీటర్ల దూరం
... ఇవి కాకుండా అంతర్వేది కాట్రేనికోన అయినవిల్లి అల్లవరం ఐ పోలవరం మామిడికుదురు రాజోలు సఖినేటిపల్లి రావులపాలెం కపిలేశ్వరం కొత్తపేట ముమ్మడివరం కె.గంగవరం తాళ్లరేవు సీతానగరం ఆత్రేయపురం పి.గన్నవరం తదితర మండలాల్లో సుమారు 150 ఘాట్లను ప్రభుత్వం నిర్మించింది.

పశ్చిమగోదావరి జిల్లా...

కొవ్వూరు: హైదరాబాద్ కు 423 కిలోమీటర్ల దూరంలో ఉంది. నీరు పుష్కలంగా ఉంది. ఇక్కడ గోష్పద క్షేత్రం ప్రముఖమైంది. ఇది కాకుండా క్రిష్ణా ఘాట్ శ్రీనివాస ఘాట్ సీతారామ సుబ్రహ్మణ్యేశ్వర ఘాట్ లు వంటివి ఉన్నాయి.

నర్సాపురం: హైదరాబాద్ కు 445 కిలోమీటర్ల దూరంలో ఉంది. నీరు పుష్కలంగా ఉంది. వివిధ ఘాట్లున్నాయి.
- ఇవి కాకుండా సిద్ధాంతం పట్టిసీమ తాళ్లపూడి ఆచంట మండలంలోని పలు గ్రామాలు తాళ్లపూడి ప్రాంతాల్లోనూ గోదావరి ప్రవహిస్తోంది.