గోల్కొండ నుంచి కుతుబ్ సాహీ వరకూ సొరంగం

Sat Aug 08 2015 11:31:14 GMT+0530 (IST)

రాజుల కాలంలో రహస్య సొరంగాలు ఏర్పాటు చేసుకోవటం మామూలే. శతాబ్దాల పర్యంతం రాజుల ఏలుబడిలో సాగి.. వారు నిర్మించిన భాగ్యనగరిలో వింతలు విశేషాలకు కొదవ లేదనే చెప్పాలి.

రాజుల కోట నుంచి వివిధ ప్రాంతాలకు రహస్య సొరంగాలు చాలానే ఉన్నాయి. రక్షణ కోసం.. మిగిలిన అవసరాల కోసం వీటిని ఏర్పాటు చేసుకోవటం.. తమ ప్రయాణాలకు అనువుగా వాటిని రూపొందించుకోవటం మామూలే. తాజాగా అలాంటి రహస్య సొరంగం ఒకటి బయటకొచ్చింది.

గోల్కొండ కోట నుంచి కుతుబ్ షాహీ సమాధుల వరకూ ఒక సొరంగాన్ని కనుగొన్నారు. నిపుణుల అంచనా ప్రకారం.. గోల్కొండ కోటను పాలించే కుతుబ్ షాహీల్లో ఎవరైనా మరణిస్తే సమాధుల వద్దకు తీసుకెళ్లేందుకు దీన్ని నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. సొరంగ మార్గంతో పాటు ఒక ఉద్యానవనం.. సహాయకుల కోసం నిర్మించిన సమ్మర్ ప్యాలెస్ తవ్వకాల్లో బయటపడ్డాయి.

నిజానికి ఇలాంటి పురావస్తు కట్టడాల్ని కనుగొనటం కోసం అక్కడెక్కడో ఉన్నఅమెరికా సాయం అందించటం చూసినప్పుడు.. మన కట్టడాల విషయం వారికెంత శ్రద్ధ అన్న భావన కలగటం ఖాయం. తాజాగా కనుగొన్న సొరంగమార్గాన్ని బయటకు తెచ్చేందుకు ఆగాఖాన్ ట్రస్ట్ తో పాటు.. అమెరికా కూడా ఆర్థిక తోడ్పాటు ఇవ్వటం గమనార్హం.

తవ్వకాల్లో బయటకు వచ్చిన సమ్మర్ ప్యాలెస్ సాంకేతికత అబ్బురంగా ఉందని చెబుతున్నారు. నడి వేసవి సమయంలోనూ.. చల్లదనం ఉండేలా రూపొందించటం విశేషం. ఇక గోల్కొండ కోట నుంచి కుతుబ్ షాహీల సమాధుల వరకూ సొరంగం మార్గం చూస్తుంటే.. కోటలో ఎవరైనా మరణిస్తే నేరుగా వారిని తీసుకొచ్చి ఖననం చేసేందుకు వీలుగా ఉండటంతో పాటు.. ప్రార్థనలు చేసుకోవటానికి వీలుగా మసీదుల నిర్మాణం ఏర్పాటు చేసిన తీరు.. వారి దూరదృష్టికి నిదర్శనంగా నిలుస్తుందనటంలో సందేహం లేదు.

అదేం చిత్రమో.. ఉన్న చారిత్రక కట్టడాల్ని కూల్చేసి.. ఆధునికంగా భవనాలు కట్టాలన్న ఆలోచన మన ప్రభుత్వాలు చేస్తుంటే.. అక్కడెక్కడో ఉన్న అమెరికా మాత్రం.. తమకు సంబంధం లేని సొరంగాలు.. పురావస్తు భవనాల్ని బయటకు తెచ్చేందుకు భారీగా నిధులు ఇవ్వటం ఏమిటో..? అయితేనేం.. పాతవాటి కోసం అమెరికావోడు ఆత్రుత పడుతుంటే.. మనం మాత్రం కొత్త కొత్త ట్విన్ టవర్లు.. భారీ భవనాల కోసం ఆత్రుత పడటం మనకు మాత్రమే సాధ్యమేమో.