విచిత్రం: పూరీ జగన్నాథ ఆలయంలో దైవదూషణ సంప్రదాయం!

Fri Jul 17 2015 13:11:41 GMT+0530 (IST)

తనకు ఇష్టమైన భక్తుడి చేత తిట్లు తినడానికి కూడా దైవం సిద్ధంగా ఉంటాడంటారు. మన పురణాలు.. చరిత్రలో.. ఎంతోమంది మహామహా భక్తులు కూడా దైవదూషణకు పాల్పడ్డవారే! "ఉన్నావా? అసలున్నావా?' అని దేవుడిని ప్రశ్నించిన వారే. మరి అలాంటి భక్తులనే దైవం కరుణించాడు. వారి భక్తికి మెచ్చి తనలో ఐక్యం చేసుకొన్నాడు. మరి ఇలాంటి ప్రభావమో ఏమో కానీ.. ఒరిస్సాలోని పూరీ జగన్నాథ దేవాలయంలో ఇలాంటి సంప్రదాయమే ఒకటి ఉంది.

ప్రతియేటా జరిగే పూరీ జగన్నాథ రథయాత్ర గురించి అందరికీ తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ ఎత్తున జరిగే ఈ కార్యక్రమానికి కొన్ని లక్షల మంది ప్రజలు హాజరవుతారు. ఇలాంటి వేడుకలో తీవ్రస్థాయిలో దైవదూషణ జరుగుతుంది. ఇది అక్క సంప్రదాయం. జగన్నాథ రథయాత్రకు అంతా సిద్ధం చేశాకా.. ఇక భక్తులంతా రథాన్ని లాగడమే తరువాయి అనే సమయంలో... ఒక అర్చకుడు స్వామి వారికి ఎదురుగా వచ్చి దైవాన్ని నిందిస్తాడు. ఒరియా భాషలో జగన్నాథుడిని తిడతాడు. ఆ తతంగం అయిన తర్వాతే రథం ముందుకు సాగుతుంది!

మరి ఎందుకలా.. ఎంతో భక్తిగా కొలుచుకొనే దేవుడిని  ఎందుకు నిందిస్తారు.. అంటే ఇలా దైవ దూషణ చేస్తే దేవుడు కరుణిస్తాడనేది ఒక నమ్మకం. పూర్వం పూరీలోనే ఒక భక్తుడు జగన్నాథుడికి గొప్పసేవలు చేస్తాడు. భక్తితో పూజిస్తాడు. అయితే అతడికి అష్టకష్టాలూ ఎదురవుతాయి. దీంతో ఆగ్రహించిన అతడు... దేవుడిని తిడతాడట. ఇంతగా పూజించే నాకు ఇన్ని కష్టాలు తెచ్చిపెడతావా? అంటూ దూషిస్తాడట. ఆ తర్వాత అతడి కష్టాలను పూరీ జగన్నాథుడు తీర్చాడని ఒక పురాణ కథ. దాని ఫలితంగా ఇప్పటికే అక్కడ దైవదూషణ ఒక సంప్రదాయంగా కొనసాగుతోంది.