భారతీయులకే కాదు ప్రపంచ యాత్రికులకూ భూలోక స్వర్గమే!

Mon Jun 08 2015 15:50:58 GMT+0530 (IST)

కాశ్మీర్ పేరు చెప్పగానే ఇండియా - పాక్ సమస్యలు కాకుండా మరింత ఎక్కువగా గుర్తుకువచ్చేది ప్రకృతి అందం! దేవుడు మనసుపెట్టి మలిచిన బొమ్మలా శ్రద్ధగా గీచిన చిత్రంలా ఉంటుంది! ఈ అందాల సుందర కాశ్మీర్ భారతీయులకే కాదు ప్రపంచ యాత్రికులకూ భూలోక స్వర్గమే! ఉద్యానవనాలు సరస్సులు పర్వతాలు పచ్చిక బయళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే... గుల్మార్గ్ ప్రదేశం పర్యాటకులకు దేవుడిచ్చిన వరం! ఒక్కమాటలో చెప్పాలంటే... ఆ నేలంతా ఓ సుందర ఉద్యాన వనమే! ఒకవైపు మంచుతో నిండిన కొండలు మరోవైపు ఆకాశంలోకి నిటారుగా ఎదుగుతూ వరుసలో ఉండే పచ్చని ఎత్తైన చెట్లు... ఎన్ని చెప్పిన తక్కువే ఈ గుల్మార్గ్ ప్రాంతాన్ని చూసేవరకూ!ముందుగా గుల్మార్గ్ ప్రాంతానికి ఎలా చేరుకోవచ్చో చూద్దాం...

శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ కు సుమారు 56 కి.మీ. ల దూరంలో ఈ గుల్మార్గ్ ప్రాంతం వుంటుంది. శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ నుండి జీపులు టాక్సీలలో సులువుగా చేరవచ్చు.

ఇండియా లోని నార్త్ నగరాల నుండి ట్రైన్ లో నేరుగా జమ్మూ చేరవచ్చు. జమ్మూ రైలు స్టేషన్ ఇండియాలోని ముంబై పూణే చండీగర్ వంటి పట్టణాలకు రైలు మార్గం ఉంది!

గుల్మార్గ్ పట్టణం జమ్మూ కాశ్మీర్ లోని అన్ని ప్రధాన పట్టణాలకు రోడ్ మార్గం వుంది. పర్యాటకులు ప్రభుత్వ ప్రైవేటు బస్సు లను ఉపయోగించవచ్చు! స్వంత కార్ల పై ప్రయాణించాలనుకునే వారు శ్రీనగర్ నుండి వెళ్లవచ్చు!

ఇప్పుడు కాశ్మీర్ లోని అందాలు ఎలా ఉంటాయో మీరే చదవండి...

రంగు రంగుల పూలు... తనివి తీరదు:

గుల్మార్గ్లో లభించే పువ్వుల వైవిధ్యం మనకు మరెక్కడా కనిపించదు. జహంగీర్ చక్రవర్తి తన బహు భార్యలకు బహుమతులుగా పువ్వులను ఇచ్చేందుకు గుల్మార్గ్కి పనిగట్టుకుని వచ్చేవాడంటేనే అర్థం అవుతుంది వీటి అందం! జహంగీర్ చక్రవర్తి... ఒక్కొక్క భార్యకు ఒక ప్రత్యేక పువ్వును ఇచ్చేందుకు అన్ని రకాల పూలూ సేకరించగా ఇంకా అనేక రకాల పూల జాతులు మిగిలిపోయేవట! అన్ని రకాల పూల జాతులు ఇక్కడ పుష్కలంగా ఉంటాయి! ఇంతకీ గుల్మార్ అంటే... "గుల్" అంటే పువ్వులు "మార్గ్" అంటే పచ్చిక బయళ్ళు... అంటే  గుల్మార్గ్ అంటే పువ్వులతో కూడిన పచ్చిక బయళ్ళు అని అర్థం! పేరులోనే ఉంది మొత్తం విషయం!

కహానా టీ:

గుల్మార్గ్ లో టీ చాలా ఫేమస్! ‘కహనా' అనే ఈ ‘టీ'లో బాదామ్ ఏలకులు దాల్చిన చెక్క పొడి వేసి చేస్తారు! ఈ బ్లాక్ టీ తాగితే... నరాలు జివ్వ్ మనాల్సిందే! టీ అయితే బాగానే దొరుకుతుంది కానీ... ఇక్కడ నీళ్లు కావాలంటే మాత్రం మంచుకు వేడి చేసుకుని తాగాల్సిందే!

మంచులో స్కేటింగ్ ఏమి మజా:

గుల్మార్గ్కి మంచులో స్కేటింగ్ చేసేందుకు విదేశీ టూరిస్టులు ప్రత్యేకంగా క్యూ కడతారు. తెలుగు సినిమా పాటల్లో చూపించినట్లు ఆ మంచులో కిందా పైనా పడుతూ ప్రేమిలులు హనీమూన్ జంటలు తెగ ఆనందిస్తుంటారు! ఇక్కడి ప్రజలు కాగితం గుజ్జుతో రకరకాల షో పీసులు ఎంబ్రాయిడరీ తివాచీలు తయారు చేస్తారు. పూర్వం రాజులు బాద్షాలు తలపాగాలు నడుంకి కట్టుకునే పట్టాలు అంగీలు జరీపనితో వున్నవి ధరించేవారట. జరీపని వున్న షాల్ నేయటానికి ఒకటి నుంచి రెండు సంవత్సరాలు పడుతుంది. వాటికి ఈ ప్రాంతం ప్రత్యేకం!

పాక్ గొర్రెల కాపరుల ఒక్కర్వాల్:

గొర్రెల కాపరులు వేసవిలో పాకిస్తాన్ నుంచి గొర్రెల మందల్ని తెచ్చి గుల్మార్గ్ సోన్మార్గ్ల దగ్గరకు తీసుకువస్తారు! వాళ్లు మందల్ని తేవటం అంతా ఆర్మీ పర్యవేక్షణలో జరుగుతుంది. వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఈ ఆచారం ‘ఒక్కర్వాల్'! అంటే ఈ గొర్రెల కాపరులు కుటుంబాలతో వచ్చి చలికాలం రాగానే వెళ్లిపోతారు! మరో విషయం ఏమిటంటే... ఇక్కడి కొన్ని హిందూ దేవాలయాల్లో ముస్లిం పూజారులు కూడా వున్నారు. ఆర్మీ యూనిట్లలో హిందూ దేవాలయం చర్చి మసీదు గురుద్వారాలు... అన్నీ ఒకే చోట వుంటాయి.

మహారాణి టెంపుల్:

గుల్మార్గ్ హిల్ స్టేషన్ మధ్యలో ఉండే మహారాణి టెంపుల్ నే రాణి టెంపుల్ అని కూడా అంటారు! ఈ టెంపుల్ ను 1915 లో కాశ్మీర్ లో రాజ పాలన చివరి లోని మహారాజ హరి సింగ్ భార్య మోహిని బై సిసోదియా నిర్మించారు! ఈ టెంపుల్ లో శివపార్వతులుంటారు!

గొందోలా లిఫ్ట్:

గొందోలా లిఫ్ట్ అనేది ఒక కేబుల్ కారు. దీనిని కాశ్మీర్ అందాలను భూమికంటే చాలా ఎత్తునుండి చుడటానికి ఏర్పాటు చేయబడ్డవే గొందోలా లిఫ్ట్ అంటె... కేబుల్ కారులన్నమాట! సముద్ర మట్టానికి సుమారు 13500 అడుగుల ఎత్తున ఉండే ఈ లిఫ్ట్ రెండు మార్గాల్లో ప్రయాణిస్తుంది! అవి గుల్మార్గ్ నుండి కొంగ్దూర్ 5 కి. మీ.లు మరియు రెండవది కొంగ్దూర్ నుండి అఫర్వాట్ 2 కి.మీ.ల దూరంగా వుంటుంది. ఈ కేబుల్ కార్ లో పర్యాటకులు ప్రయాణించి కాశ్మీర్ ప్రాంత అందాలను తనివి తీరా ఆస్వాదించవచ్చు.