కుంభమేళ తర్వాత.. గోదారిలో నీళ్లేవి?

Sun Jul 05 2015 10:19:50 GMT+0530 (IST)

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయ్యాక వస్తున్న తొలి గోదావరి పుష్కరాల్ని భారీ స్థాయిలో చేపట్టాలని.. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే కుంభమేళను తలపించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే.

ముంగిట్లోకి పుష్కరాలు వస్తున్న వేళ..అరకొర అయిన పనులతో పాటు.. మరో అంశం తెలంగాణ సర్కారును తీవ్రంగా కలిచివేస్తోంది. పుష్కరాలకు అత్యంత కీలకమైన నీరు లేకుండా.. గోదారి ఏడారి తలపించేలా ఇసుక మేటలు వేయటంపై ఏం చేయాలో తోచక తల పట్టుకునే పరిస్థితి.

వర్షాభావం తక్కువగా ఉండటం.. ఎగువన వర్షాలు అంత జోరుగా పడకపోవటంతో.. నీరు అన్నది లేకుండా ఉన్న పరిస్థితి. కనుచూపు మేర నీటి జాడ లేక.. ఇసుక మేటతో మొత్తం నిండిపోవటంతో.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిష్ఠాత్మకంగా తర్వాత సంగతి.. పుష్కరాలకు కనీసం కావాల్సిన నీరే లేని నేపథ్యంలో.. పుష్కరాలకు ఎక్కడ స్నానం చేస్తారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎగువ నుంచి వరద నీరు వచ్చినా ఎంతోకొంత జలకళ కనిపిస్తుంది. అలాంటి పరిస్థితులేమీ కనిపించని నేపథ్యంలో పుష్కరాల్ని కుంభమేళ స్థాయిలో జరపాలన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల.. కలగానే మిగిలిపోతుందా? అన్నది ప్రశ్నగా మారింది.