ఈ బాహుబలిని ఇంకా చూడలేదా..?

Thu Jul 16 2015 13:42:20 GMT+0530 (IST)

భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి అతిపెద్ద నిదర్శనం.. అన్ని మతాల ప్రజలకూ చోటిచ్చే భారత్ లో ఆయా మతాల ప్రజలు కేవలం తమ జీవనం సాగించడమే కాకుండా తమ ఆచారాలు సంప్రదాయాలు నిరాటంకంగా సాగిస్తూనే తమ సిద్ధాంతాన్ని విధానాలను చరిత్రను కాపాడుకునేందుకు భావితరాలకు అందించేందుకు వీలుగా పలు నిర్మాణాలు కూడా చేపట్టారు. స్మారక స్థూపాలు విగ్రహాలు ఆలయాలు మసీదులు చర్చిలు అనేక ప్రార్థనామందిరాలు... ఒకటేమిటి ఎన్నో చారిత్రక కట్టడాలకు నిలయం ఈ భారతావని.  హిందూ ముస్లిం క్రైస్తవం సిక్కు జైన బౌద్ధ సంస్కృతులు ఈ నేలపై వ్యాపించాయి. చారిత్రక కట్టడాల రూపంలో ఆయా మతాలు సంస్కృతుల చిహ్నాలు ఉన్నాయి. వాటిలో కొన్ని కాలక్రమంలో ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి.

వేల ఏళ్ళకిందటే భారతదేశంలో ప్రాచుర్యానికి నోచుకున్న జైనమతం రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందింది. అందుకే ఆ రాష్ట్రాల్లో జైన దేవాలయాలు సంస్కృతి చిహ్నాలు మనకు దర్శనమిస్తాయి. దేశంలోని ప్రసిద్ధ జైన కేంద్రాల్లో శ్రావణ బెళగొళ విశిష్ఠమైనది. ఇక్కడ దేశంలోనే అత్యంత పెద్దదైన  బాహుబలి  విగ్రహం ఉంది.  ఆకాశాన్ని తాకేలా కనిపించే ఈ విగ్రహాన్ని దర్శంచేందుకు నిత్యం వేలమంది పర్యాటకులు వస్తుంటారు.

బాహుబలి... ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశమంతా ఎవరి నోట విన్నా ఇదే నామం. ఇటీవల విడుదలై అందరినీ ఆకట్టుకుంటున్న చారిత్రక చిత్రమిది... బాహుబలి అంటే కొందరికి సినిమాగా ఆ సినిమాలో పాత్రగానే తెలుసు.. బాహుబలి అసలు పేరు గోమఠేశ్వరుడు... అసలైన బాహుబలి గురించి తెలిసినవారూ ఎందరో ఉన్నారు... మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలోని శ్రావణబెళగొళలో ఉన్న బాహుబలి భారీ విగ్రహం నిజంగా ఆ బాహుబలి గొప్పదనానికి సరిసమానం.

శ్రావణ బెళగొళలో ఉన్న 58 అడుగుల బాహుబలి (గోమఠేశ్వరుడు) విగ్రహం దేశంలోని జైన తీర్థంకరుల విగ్రహాలన్నింటిలోకి పెద్దది. క్రీస్తు శకం 983వ సంవత్సరంలో చాముండరాయ అనే మంత్రి గోమఠేశ్వరుని విగ్రహాన్ని ఇంద్రగిరి పర్వతంపై చెక్కించాడని చరిత్ర చెబుతోంది. కొండ చివరి భాగంలో విగ్రహం మలిచారు. బాహుబలి ముఖం ప్రశాంతతకు చిహ్నంగా సర్వం త్యజించిన వ్యక్తిగా ఈ విగ్రహాన్ని చూడగానే తెలుస్తుంది. ధ్యానంలోనే శిలగా మారిన మనిషి చుట్టూ చెట్లు అల్లుకుపోయినట్లు బాహుబలి భుజాల చుట్టూ చెట్ల తీగలు ఆకులను అద్భుతంగా చెక్కారు. విగ్రహం కాలిగోళ్ళు వాటి చుట్టూ ఉండే చర్మం గీతలు సహజంగా ఉన్నట్లు చాలా స్పష్టంగా చెక్కారు. ఈ విగ్రహం ఎంత ఎత్తు ఉంటుందంటే... విగ్రహం వద్దకు వెళ్లి నిల్చుంటే దాని పాదాలు మన ఎత్తులో ఉంటాయి.

శ్రావణ బెళగొళకు ఆ పేరెలా వచ్చింది..

కన్నడంలో బెళ్ళి అంటే తెల్లని అని గొళ అంటే నీటిగుండం అని అర్థం. రెండు కొండల మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన భారీ తటాకాన్ని బెళగొళ అంటారు. చంద్రగిరి ఇంద్రగిరి అనే రెండు కొండల మధ్య ఉంది శ్రావణ బెళగొళ.. జైన సంప్రదాయం ప్రకారం సంసార జీవితాన్ని త్యజించి సన్యాసాశ్రమం స్వీకరించిన వారిలో అత్యంత పూజనీయులైన వారిని శ్రవణులు అంటారు. అలాంటి శ్రవణులు ఈ కొండ పరిసరాల్లో ధ్యానం చేసుకునేవారు... శ్రవణులు ఉన్న ప్రాంతం కాబట్టి ఇది శ్రవణ బెళగొళ.. క్రమంగా  శ్రావణ బెళగొళగా ప్రసిద్ధి పొందింది. కన్నడ నాట మాత్రం దీన్ని ఇప్పటికీ బెళగొళగానే పిలుస్తారు.

మహాబలుడు బాహుబలి

గోమఠేశ్వరుడు జైనమతం అవలంభించి ధ్యానముద్రలోకి వెళ్ళడానికి కారణంగా ఒక కథ ప్రచారంలో ఉంది. బాహుబలిగా పిలిచే గోమఠేశ్వరుడు రుషభనాథుని కుమారుడు (రామాయణంలో శ్రీరాముని వంశానికి మూల పురుషుడు రుషబుని ఉంది.) ఇతడికి ఇద్దరు భార్యలు. రాజ్యాన్ని పిల్లలందరికీ సమానంగా పంచాడు. పెద్ద భార్య పెద్ద కొడుకు భరతునికి రాజదాని కోసల పట్టణాన్ని అప్పగించి మిగిలిన కొడుకుల రాజ్యభారం బాధ్యత కూడా అప్పగించాడు. భరతునికి రాజ్యాన్ని విస్తరించాలన్న కోరిక కలిగింది. తమ్ముళ్ళందరిపై దండయాత్ర చేశాడు. బాహుబలి మినహా అందరూ రాజ్యాన్ని భరతుని వశం చేసి తపస్సు చేసుకోవడానికి తండ్రి వద్దకు వెళ్ళిపోయారు. అన్న దురాక్రమణ సహించలేని బాహుబలి భరతుని ఎదిరిస్తాడు. స్వతహాగా శాంతికాముకుడైన బాహుబలి యుద్దంలో అనవసరమైన ప్రాణనష్టాన్ని వద్దని ద్వంద్వ యుద్దం చేసి గెలుస్తాడు. భరతుడి గుండెపై పిడికిలితో పగలగొట్టబోయి అంతలోనే పునరాలోచనలో పడతాడు. ఇహపరమైన సుఖాల కోసం పాపపు పనులు చేయడం ఎందుకని భరతుని వదిలివేసి రాజ్యాన్ని అతడికే అప్పగించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇంద్రగిరి కొండపై బాహుబలి తపస్సు చేసి మోక్షం పొందిన ప్రాంతంలోనే దేవాలయ నిర్మాణం జరిగినట్లు భావిస్తారు.

మస్తకాభిషేకం మహాద్భుతం

గోమఠేశ్వరుడికి 12 ఏళ్ళకోసారి మహామస్తకాభిషేకం నిర్వహిస్తారు. అభిషేకం చేసేటప్పుడు కింద నిలబడి పాదాలను మాత్రమే అభిషేకించగలం. గోమఠేశ్వరునికి క్యాన్ల కొద్దీ పాలు తేనె పెరుగు అన్నం కొబ్బరి పాలు నెయ్యి చక్కెర బాదం పప్పు కుంకుమ పువ్వు నాణేలు పసుపు పండ్లతో విగ్రహం మొత్తం తడిసేదాకా అభిషేకం చేస్తారు. పూజారులు విగ్రహం పై నుండి అభిషేకం చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తారు. దీని మీదకు వెళ్ళి అభిషేకం తంతు పూర్తి చేస్తారు. పర్యాటకులకు మహామస్తకాభిషేకం సమయంలో చూడటం కంటే మామూలు రోజుల్లో వెళ్ళడమే మంచిది.  కొండమీద ఉన్న ఈ ఆలయానికి చేరడానికి సుమారు 20 నిమిషాలు పడుతుంది.

బాహుబలి విగ్రహం తర్వాత ఇక్కడ చూడాల్సిన ప్రాంతాలన్నీ దాదాపుగా జైనమత ప్రాధాన్యం ఉన్నవే. జైన తీర్థంకరుల దేవాలయాలు ఉన్నాయి. వీటిలో చంద్రగిరి పర్వతం మీద అశోకుడు నిర్మించినట్లు నిర్మించినట్లు చెబుతున్న చంద్రగుప్త బస్తీ ముఖ్యమైనది. ఇందులో సెమీ ప్రిషియస్ స్టోన్స్ పొదిగి అద్భుతంగా చెక్కిన ఎనిమిది విగ్రహాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఉన్నన్ని శాసనాలు మన దేశంలో మరే ప్రాంతంలోనూ లేవు. చరిత్ర పరిశోధకులు 523 శాసనాలను గుర్తించారు.

ఎలా వెళ్లాలి..

శ్రావణ బెళగొళ కర్నాటక రాష్ట్రం హసన్ జిల్లాలో ఉంది.బెంగుళూరుకు పశ్చిమంగా 146కి.మీ.దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి 11కి.మీ.దూరంలో ఉన్న చెన్నరాయ పట్టణం ప్రధాన కేంద్రం. ఇక్కడికి అన్ని ముఖ్యమైన పట్టణాలను కలుపుతూ రవాణా సౌకర్యాలు ఉన్నాయి. బెంగుళూరు-మంగుళూరు హైవేలో వస్తుంది. రైళ్లలో చేరాలంటే హసన్ రైల్వే స్టేషన్‌లో దిగి రోడ్డు మార్గం గుండా ప్రయాణించాలి. దీనికి సమీపంలోని విమానాశ్రయం బెంగుళూరే.