Begin typing your search above and press return to search.

12 ఏళ్ల పండుగ; వచ్చేశాయి గోదావరి పుష్కరాలు

By:  Tupaki Desk   |   14 July 2015 4:20 AM GMT
12 ఏళ్ల పండుగ; వచ్చేశాయి గోదావరి పుష్కరాలు
X
గోదారమ్మ పుష్కరాలు వచ్చేశాయి. పన్నెండేళ్లకు ఒకసారి.. పన్నెండు రోజుల పాటు సాగే గోదావరి పుష్కరాలు ఈ రోజు (మంగళవారం ఉదయం 6.21గంటల నుంచి 6.26 గంటల మధ్య) ప్రారంభమయ్యాయి. కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్న పుణ్యగడియలు వచ్చేశాయి. ఇంతకీ పుష్కరాలు అంటే ఏమిటి? వాటికి ఎందుకంత ప్రాధాన్యత? పుష్కరాల సమయంలో ఏమేం చేస్తారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చూస్తే..

సర్వ దేవతలకు గురువు బృహస్పతి. అతను సింహరాశిలో ప్రవేశించే కాలమే గోదావరి నదీ పుష్కరాలుగా చెబుతారు. ఇంద్రుడికి.. వృత్తాసురుడికి బద్ధవైరం. మహావిష్ణువు సాయంతో ఇంద్రుడు వృత్తాసురుడిని వధిస్తాడు. బ్రహ్మహత్యా పాపం తొలిగి పోయేందుకు ఇంద్రుడు పుష్కర తీర్థంలో స్నానం చేస్తాడు. అతనికి అంటిన పాపం పోయంది. దాని పవిత్రత గుర్తించిన ఇంద్రుడు దానిని దేవలోకానికి తీసుకెళ్లాడు.

అప్పుడు మానవుడు బ్రహ్మదేవుడ్ని ప్రార్థించి.. గురు సంచారాన్ని అనుసరించి పుష్కర తీర్థం ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరం మొదటి 12 రోజులు ఉండేలా వరం కోరాడు. బ్రహ్మ అనుగ్రహించాడు. అలా ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరం పుష్కరాలు వస్తుంటాయి. ఇందులో మొదటి 12 రోజులను అది పుష్కరాలని.. చివరి 12 రోజులు అంత్య పుష్కరాలని చెబుతారు.

పుష్కరాల సమయంలో 33 కోట్ల మంది దేవతలు పుణ్యనదిలోనే ఉంటారన్నది విశ్వాసం. అందుకే పుష్కర స్నానం పుణ్యప్రదమంటారు. ముక్కుమూసుకొని మూడు మునకలు వేస్తారు. పుష్కర కాలంలో పుణ్య స్నానాలు చేస్తే జీవిత కాలంలో చేసిన దోషాలన్నీ పోతాయన్నది ఒక నమ్మకం. మరికొందరు.. నదమ్మ ఇసుకను శరీరానికి పూసుకొని స్నానం చేస్తుంటారు. ఇలా చేయటం ఆరోగ్యానికి ఔషధంగా పని చేస్తుందని చెబుతుంటారు.

ఇంతకీ పుష్కరుడు ఎవరు?

సృష్టి జరగటానికి ముందుగా భూమి.. నీరు.. వాయువు.. అగ్ని.. ఆకాశం అనే పంచభూతాలు పుట్టాయి. అయితే.. నీటి దేవతకు గర్వం ఎక్కువై మిగిలిన నాలిగింని తనలో కలిపేసుకుంది. దీంతో లోకమంతా జలమయంగా మారి నీరు బ్రహ్మలోకానికి చేరుకుంది. అలా చేరిన నీటి గర్వాన్ని చూసిన బ్రహ్మదేవుడు దాని గర్వాన్ని అణచటానికి మూడు భాగాలుగా విభజించాడట. అందులో ఒకటి శివుడి శిరస్సు మీద.. ఒకటి శ్రీ మహావిష్ణువు పాదాల వద్ద.. మూడోది.. బ్రహ్మ కమండలంలో ఉంచి.. లోకాలను యథాతథ స్థితికి తెచ్చాడట.

ఇక బ్రహ్మ మానసపుత్రిక అహ్యల పుట్టింది. అంత అందమైన అమ్మాయిని చూసిన ఇంద్రుడు ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలని కోరితే బ్రహ్మ అందుకు అంగీకరించక.. మహారుషి గౌతమునికిచ్చి పెళ్లి చేస్తాడు. అహల్య మీదున్న కోరికతో ఇంద్రుడు ఆమెను ఎలాగైనా పొందాలన్న దురద్దేశంతో అర్థరాత్రి వేళ కోడిలా కూసి.. గౌతముడిని స్నానానికి పంపి.. గౌతముడి రూపంలో అహల్యను అనుభవించి తన కోరిక తీర్చుకుంటాడు. ఇంతలో తిరిగి వచ్చిన గౌతముడు.. విషయం తెలుసుకొని అహల్యను రాయిలా.. ఇంద్రుడ్ని నపుంశకునిగా మారాలని శపిస్తాడు.

లోకాన్ని రక్షించాల్సిన ఇంద్రుడే దుర్మార్గంగా వ్యవహరిస్తే.. కామ క్రోథాలతో ఉండే జగతికి రక్ష ఎవరని ఆలోచించిన బ్రహ్మ ఇంద్రుడు.. దేవతల పాపాల్ని ప్రక్షాళన చేయటానికి తన కమండలం నుంచి పుష్కరుడిని పుట్టించాడట. ముందుగా ఇంద్రుడి పాపాన్ని కడిగేసిన పుష్కరుడు తర్వాత తన విధేమిటని బ్రహ్మను అడిగితే.. భూలోకానికి వెళ్లి ప్రతి నదిలో ఏడాదికి పన్నెండు రోజులు ఉండమని శాసించాడట. అలా పుష్కరుడిలో స్నానం చేస్తే పాప ప్రక్షాళన జరుగుతుందన్న భావనతో 33 కోట్ల మంది దేవతలు నదిలో స్నానం ఆచరించటంతో పుష్కరాలకు అంతటి ప్రాధాన్యత వస్తుందని చెబుతారు.

పుష్కర నీటిలో శక్తి ఉందా?

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పురాణాలే కాదు.. నాగరిక ప్రపంచంలోనూ పుష్కరాల మీద పరిశోధనలు జరిగాయి. పుష్కరాల ముందు.. పుష్కరాల సమయంలో గోదావరి నీటి శాంపిళ్లను పరిక్షిస్తే ఈ విషయం బయటపడిందని చెబుతారు. 1967లో పుష్కరాలకు ఆరు నెలల ముందు జర్మనీ నుంచి 14 మంది సైంటిస్టులు వచ్చి రాజమండ్రిలోని నీటి శాంపిళ్లను సేకరించి.. పరీక్షలు జరిపారు. మళ్లీ.. పుష్కరాల సమయంలో వచ్చిన వారు మరోసారి శాంపిళ్లను సేకరించి పరీక్షలు జరిపితే.. మామూలు గోదారి నీళ్లకు.. పుష్కర సమయంలోని సేకరించిన నీళ్లలో ప్రత్యేక ఉందని.. పుష్కరాల సమయంలో గోదారికి జీవశక్తి ఉందని గుర్తించారు.

పుష్కర స్నానం సమయంలో ఏం చేయాలి

పుష్కరాల సమయంలో భార్యభర్తలు కొంగుముడి వేసుకొని స్నానం చేస్తుంటారు. దీన్నే ఏకవస్త్ర స్నానవిధిగా చెబుతుంటారు. ఇలా జంటగా స్నానం చేస్తే చాలా పుణ్యం వస్తుందని చెబుతారు. భార్య చీర కొంగును.. భర్త మీదున్న వస్త్రాన్ని ముడి వేసి స్నానం చేస్తుంటారు. ఇదంతా పండితుని సమక్షంలో జరిపితే పుణ్యంతో పాటు.. మంచి సంతానం లభిస్తుందన్నది నమ్మకం. పుష్కరాల సందర్భంగా బ్రాహ్మణలతో ప్రత్యేక పూజలు చేయించుకునే వారు ఉంటారు. గతంలో ఇదంతా భక్తితో ముడి పడి ఉన్నా.. ఇప్పుడు అంతా వ్యాపారమయం కావటంతో.. శక్తి ఉన్న వారు పూజాదికాదులు చేస్తారు. పితృదేవతలకు మాత్రం పూజలు తప్పనిసరి అని చెబుతారు.

పుష్కరాల్లో పిండ ప్రదానం

పుష్కరాల సమయంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం చాలా ఎక్కువగా చేస్తుంటారు. మిగిలిన పూజల కంటే కూడా పిండ ప్రదాన పూజకే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తుంటారు. పిండ ప్రదానాన్ని చూస్తే.. 24 రకాల అనుబంధాల.. బంధుత్వాల వారికి ఈ సందర్భంగా పూజ చేస్తారు. తండ్రి గతించిన వారు మాత్రమే పిండ ప్రదాన కార్యక్రమానికి అర్హులు.

24 మంది బంధువుల వరుసలో మొదట తండ్రి.. తాత.. ముత్తాత.. తల్లి.. నానమ్మ.. నానమ్మ అత్త.. సవతి తల్లి.. తల్లి తండ్రి.. తల్లి తాత..తల్లి ముత్తాత.. తల్లి అమ్మ.. తల్లి నాయనమ్మ.. తల్లి నాయనమ్మ అత్త..ఇలా చాలామంది ఉంటారు. ఈ వరుస క్రమాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. భారతీయ కుటుంబ ధర్మం.. వారి మధ్య అనుబంధాల్ని ఈ పూజలు గుర్తు చేస్తాయి.

అంత్య పుష్కరాలు

పుష్కరుడు సింహరాశిలో ప్రవేశించటాన్ని పుష్కరాలు అంటారు. అదే విధంగా పుష్కరుడు సింహారాశి నుంచి మరోరాశికి వెళ్లటాన్ని అంత్య పుష్కరాలుగా చెబుతారు. వీటిల్లో ప్రవేశించటానికి.. వెళ్లిపోవటానికి ప్రత్యేకంగా చూస్తారు. ఈ అంత్య పుష్కరాలు కూడా 12 రోజులు సాగుతాయి. సాధారణంగా పుష్కరాలు మొదలైన మొదటి 12 రోజులు గోదావరిలో ఉదయాన్నే పుష్కర స్నానం చేయాలి. మధ్య పుష్కరాలకు మధ్యాహ్నం మాత్రమే చేయాలి. అదే సమయంలో పుష్కరాలు పూర్తయిన అంత్య పుష్కరాల సమయంలోనూ ఉదయాన్నే పుష్కర స్నానం చేయాలి. పుష్కరాల కాలంలో పుణ్య స్నానం చేయటం మిస్ అయినా.. అంత్య పుష్కరాల సమయంలోనూ స్నానాలు చేసినా దక్కాల్సిన పుణ్యఫలం దక్కుతుందని చెబుతారు.