కొబ్బరి చెట్టు కాదు... సెల్ ఫోన్ టవర్

Thu Jul 16 2015 15:45:53 GMT+0530 (IST)

    సెల్ ఫోన్ టవర్ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.... ఆకాశంలోకి నిచ్చెన వేసినట్లుగా చాలా ఎత్తున ఉంటుంది... దానికి భారీ సెటప్  కూడా ఉంటుంది. టెక్నాలజీ అడ్వాన్సవుతున్న కొద్దీ అన్నీ రూపం మార్చుకుంటున్నాయి. కొత్తగా 4జీ సేవలందించేందుకు వేస్తున్న టవర్లు అసలు సెల్ టవర్లలా లేనేలేవు. చెట్టు ఆకారంలో ఉంటున్నాయి. సెల్ ఫోన్ టవరే చెట్టులాగా ఉంటుంది. దీని వల్ల రేడియేషన్ కూడా తక్కువ అని చెబుతున్నారు. ఇలాంటి ట్రీ టవర్ ఒకటి హైదరాబాద్ శివరాల్లో రంగారెడ్డి జిల్లా మేడ్చల్ వెళ్లే దారిలో అవుటర్ రింగురోడ్డు సమీపంలో గూడవల్లి వద్ద ఏర్పాటు చేశారు.  ఇది కొబ్బరి చెట్టును పోలి ఉంది. ఈ కృత్రిమ కొబ్బరి చెట్టుకు అమర్చిన పరికరాలు 4జీ మొబైల్ సిగ్నల్స్ ను అందుకోవడం ప్రసారం చేయడం చేస్తాయి.ప్రస్తుతం వేసిన ఈ కొబ్బరి చెట్టు సెల్ టవర్ ను ప్రయోగాత్మకంగా వేసినట్లు చెబుతున్నారు. ఇది సక్సెస్ అయితే... రాష్ట్రమంతా ఈ రూపంలోని 4జీ టవర్లే వేస్తామని చెబుతున్నారు.  కొబ్బరి చెట్టులా 25 మీటర్ల పొడవున్నప్పటికీ చెట్టు కాండం కంటే తక్కువ వెడల్పున్న స్టీల్ పైప్‌తో ఈ కృత్రిమ చెట్టును తయారుచేశారు.  సాధారణ టవర్ల కంటే ఇది చాలా తక్కువ స్థలంలోనే ఇమిడిపోయింది.

సెల్ ఫోన్ సర్వీసు ప్రొవైడర్లు టవర్ల ఏర్పాటులో స్థల సమస్య అద్దె భారం అధిగమించడానికి ఈ చెట్లు నాటుతున్నట్లు చెబుతున్నారు. కాగా హైదరాబాద్ లో మెట్రో రైల్ వ్యవస్థ పూర్తయ్యే నాటికి ప్రతి మెట్రో స్టేషన్ వద్ద ఇలాంటి నాలుగు 4జీ ట్రీ టవర్లు వేస్తారట.