Begin typing your search above and press return to search.

ఆఫీసుకు రంగులేసినందుకు రూ.1270కోట్లు..!

By:  Tupaki Desk   |   11 Jun 2015 9:43 AM GMT
ఆఫీసుకు రంగులేసినందుకు రూ.1270కోట్లు..!
X
ఇల్లు కానీ.. ఆఫీసు కానీ అదెంత ఇంద్రభవనం కానీ.. కేవలం పెయింట్‌ వేసినందుకు రూ.1270కోట్ల మొత్తం ఇస్తారా? అన్న డౌట్‌ రావొచ్చు కానీ.. అలాంటి సంఘటన జరిగింది. కాకపోతే.. ఇంత భారీ మొత్తం ఇవ్వటానికి వెనుక ఆసక్తికరమైన కథనమే ఉంది.

పదేళ్ల క్రితం ఫేస్‌బుక్‌ను స్టార్ట్‌ చేసే సమయంలో.. తాము ఏర్పాటు చేసిన ఆఫీసుకు రంగులు వేయాలంటూ డేవిడ్‌ చో అనే పెయింటర్‌ను ఫేస్‌బుక్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు షాన్‌ పార్కర్‌ కోరారు. ఆఫీసుకు మంచి రంగులు వేయటంతో పాటు.. మంచి పెయింటింగ్స్‌ కూడా ఇస్తానని అందుకు 60వేల డాలర్లు ఇవ్వాలంటూ సదరు పెయింటర్‌ బేరం పెట్టాడు.

తమది అప్పుడే పెట్టిన కంపెనీ కాబట్టి.. అంత మొత్తం చెల్లించే ఆర్థిక పరిస్థితి తమ వద్ద లేదని.. కావాలంటే అతను కోరిన మొత్తానికి సరిపడా కంపెనీ షేర్లు ఇస్తామని చెప్పారు. అయితే.. పార్కర్‌ చురుకుదనాన్ని.. అతని వ్యాపార మెళుకువులను గుర్తించిన సదరు పెయింటర్‌ ఆ డీల్‌కి ఓకే చెప్పేశాడు. ఆపీసుకు చక్కడా రంగులు.. పెయింటింగ్‌ వేసి ఇచ్చేశాడు. అందుకు ప్రతిగా తనకు ఇచ్చిన షేర్లు తీసుకెళ్లిపోయాడు.

కట్‌ చేస్తే.. ఇది జరిగి పదేళ్లు అవుతోంది. ఫేస్‌బుక్‌ ప్రపంచాన్ని ఎంతలా ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఝూమ్మంటూ దూసుకుపోయిన ఫేస్‌బుక్‌ విజయంతో.. ఆ కంపెనీ షేర్లు భారీగా పెరిగిపోయాయి. నాడు పెయింట్‌ వేసినందుకు ఇచ్చిన షేర్ల మొత్తం విలువ ఇప్పుడు ఏకంగా రూ.1270కోట్లుగా అయ్యాయి. ఆఫీసుకు పెయిటింగ్‌కు ఇంత భారీ మొత్తం రావటం చూసినప్పుడు.. డేవిడ్‌ చో అదృష్టాన్ని అరచేతిలో పెట్టుకొని తిరుగుతున్నాడనిపించక మానదు.