Begin typing your search above and press return to search.

మనోడి సారథ్యంలో మూణ్నెళ్లలో రూ.20వేల కోట్ల నష్టం

By:  Tupaki Desk   |   22 July 2015 6:30 AM GMT
మనోడి సారథ్యంలో మూణ్నెళ్లలో రూ.20వేల కోట్ల నష్టం
X
ఒక బుల్లి రాష్ట్రం వార్షిక బడ్జెట్ అంత మొత్తం నష్టంగా నమోదు అయితే.. సదరు కంపెనీ పరిస్థితి ఏంటి? అది కూడా తెలుగువాడి సారధ్యంలో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి చోటు చేసుకోవటం కాస్తంత ఇబ్బందికరమే. వ్యాపారం అన్నాక.. కంపెనీ అన్నాక లభాలు.. నష్టాలు సర్వ సాధారణం. కాకుంటే.. ఒక కంపెనీకి కేవలం మూడు నెలల వ్యవధిలో ఏకంగా రూ.20, 368కోట్ల నష్టం అంటే మాటలా? ఇంతకీ ఇంత భారీ నష్టాన్ని ప్రఖ్యాత ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ తాజాగా ఈ భారీ నష్టాల్ని చవి చూసింది.

తాజాగా గడిచిన మూడు నెలల కాలంలో కంపెనీ ఆర్థిక నివేదిక వెల్లడిలో ఈ కఠిన వాస్తవం బయటకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టంకు ఆదరణ తగ్గటం.. అండ్రాయిడ్ మోజు పెరగటం.. మొబైల్ మార్కెట్ లో మైక్రోసాఫ్ట్ దూసుకెళ్లలేకపోవటం.. నోకియా కంపెనీ కొనుగోలు.. వెరసి ఈ భారీ నష్టాలకు కారణాలుగా చెబుతున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా తమ ఆపరేటింగ్ సిస్టం విండోస్ 10ను ఈ నెల 29న విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇంత భారీ నష్టాల్ని మైక్రోసాఫ్ట్ పేర్కొనటం గమనార్హం. రానున్న రోజుల్లో విండోస్ కొత్త వెర్షన్ ఉండదని.. విండోస్ 10తో ఆపేస్తామని.. భవిష్యత్తు మొత్తం.. దాన్ని అప్ డేట్ చేయటం మాత్రమేనని చెబుతున్న మైక్రోసాఫ్ట్.. ఈ మధ్య కాలంలో సాఫ్ట్ వేర్ అభివృద్ధి నుంచి క్లౌడ్ మీదకు దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా మనోడిగా చెప్పే తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల సారథ్యంలో మైక్రోసాఫ్ట్ ఇంత భారీ నష్టాల్ని చవి చూడటం కాస్తంత నిరుత్సాహానికి కలిగించే అంశమే.