Begin typing your search above and press return to search.

ట్విట్టర్ లో ఆ సదుపాయం రానుందా?

By:  Tupaki Desk   |   28 July 2015 6:50 AM GMT
ట్విట్టర్ లో ఆ సదుపాయం రానుందా?
X
ఇవాళ.. రేపటి రోజున హవా అంతా సోషల్ మీడియాదే. నిజానికి సోషల్ మీడియాలు చాలానే ఉన్నా.. అనేక సంచలనాలకు వేదికగా నిలుస్తోంది ట్విట్టర్. బుజ్జిగా కనిపించే ట్విట్టర్ పిట్ట చేసే సంచలనాలు అంతా ఇంతా కాదు. ఈ వేదిక మీద నుంచి ఒక్కసారి మాట జారితే ఇక అంతే సంగతులు. ఇప్పటికే ఈ ట్విట్టర్ పిట్ట సాయంతో చేసిన ట్వీట్స్ కారణంగా ఎంతోమంది తమ పదవుల్ని పోగొట్టుకోవటమే కాదు.. మరెన్నో తలనొప్పులు తెచ్చి పెట్టుకున్నారు.

తాజాగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ కావొచ్చు.. మొన్నటికి మొన్న బాలీవుడ్ భామ నేహా ధూపియా కావొచ్చు. ట్విట్టర్ ట్వీట్స్ కారణంగా రేగే దుమారం అంతా ఇంతా కాదు. ట్విట్టర్ లో ట్వీట్స్ చేసేవారు.. తాము చేసిన ట్వీట్స్ ను అయితే పోస్ట్ చేయటం.. లేదంటే.. దాన్ని డిలీట్ చేయటం తప్పించి..తాము పోస్ట్ చేసిన ట్వీట్స్ ను అవసరానికి తగ్గట్లుగా ఎడిట్ చేసుకునే సౌకర్యం లేదు.

తాజాగా.. ఈ ఇబ్బందిని ట్విట్టర్ సీఈవో దృష్టికి తీసుకెళ్లారు హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియన్. తన సెల్ఫీలతో.. తన పోస్టింగులతో నిత్యం అభిమానులకు టచ్ లో ఉంటూ.. తనను అభిమానించే వారిని నిత్యం అలరించేందుకు విపరీతంగా ప్రయత్నించే కిమ్.. తాజాగా ట్విట్టర్ సీఈవోకి ఒక లేఖ రాశారు. అందాలు ఆరోబోయటం.. చిలిపిగా పోస్టింగులు పెట్టే ఈ భామ ట్విట్టర్ సీఈవోకి లేఖ రాసిందంటే.. అందులోని కంటెంట్ ఏముంటుందా? అన్న సందేహం కలగొచ్చు. కానీ.. అమ్ముడు తెర మీదకు తీసుకొచ్చిన అంశం చాలా సీరియస్ అయినదే కాదు.. ఎంతో మంది ఇబ్బంది పడేది.

ట్విట్టర్ లో ట్వీట్ చేసిన తర్వాత.. అవసరానికి తగ్గట్లు ఎడిట్ చేసే సౌకర్యం సదరు ట్వీట్ చేసిన వ్యక్తికి అందిస్తే.. ఎంతో ఉపయోగపడుతుంది? కదా అన్నది ఆమె ప్రశ్న. ఈ అంశంపై దృష్టి పెట్టాలని ట్విట్టర్ సీఈవోని కోరింది. కిమ్ ఆలోచనను స్వీకరించిన ట్విట్టర్ తాము ఈ అంశంపై దృష్టి సారిస్తామని స్పందించారు. ఒకవేళ.. అలాంటి నిర్ణయం కానీ.. ట్విట్టర్ తీసుకుంటే.. చాలా వివాదాలు.. సమయానుకూలంగా సమిసిపోయే ఛాన్స్ ఉంది. మరి.. ట్వీట్స్ ను ఎడిట్ చేసే సౌకర్యం ట్విట్టర్ ఇస్తుందో లేదో చూడాలి.