జీమెయిల్లో సరికొత్త ఫీచర్

Sun Jul 19 2015 10:02:39 GMT+0530 (IST)

ఒక్కసారి మన మొబైల్స్ లో అలారం ఫీచర్ లేపేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. చాలామంది జీవితాలు అల్లకల్లోలమైపోతాయి. పొద్దున అలారం బెల్లు మోగితే తప్ప అంత ఈజీగా మెలకువ రాదు. ఇంకా ఏవైనా ముఖ్యమైన ఈవెంట్లున్నా సరే.. వాటిని మొబైలే మనకు గుర్తు చేయాలి. జనాలు టెక్నాలజీ మీద ఎంతగా ఆధారపడుతున్నారో తెలుసుకున్న కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంటాయి. గూగుల్ వాడు కూడా మెయిల్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తూనే ఉంటాడు. తాజాగా జీమెయిల్లోనూ అలారం తరహా ఫీచర్ ఒకటి అందుబాటులోకి తెచ్చాడు. అదే స్నూజ్ ఈమెయిల్స్ రిమైండర్ ఫీచర్.

ఏవైనా ముఖ్యమైన మెయిల్స్ తర్వాత ఎప్పుడైనా చదువుకోవాలనుకున్నా.. లేదా వాటి గురించి గుర్తు చేసుకోవాలన్నా ఈ కొత్త ఫీచర్ ఉపయోగించుకుంటే సరి. ఏదైనా మెయిల్ లేదా రిమైండర్ ఓపెన్ చేయగానే పైన గడియారం గుర్తుతో స్నూజ్ బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ మెయిల్ ఏ రోజు ఏ టైంకి ఓపెన్ కావాలో దాని ప్రకారం సెట్ చేసుకునే వీలుంటుంది. మనం అనుకున్న టైంకి ఆటోమేటిగ్గా మెయిల్ ఇన్ బాక్స్ టాప్ లో హైలైట్ అవుతూ కనిపిస్తుంది. కావాలంటే మళ్లీ దాన్ని అలారం తరహాలోనే ‘రిపీట్’ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వేరే చెప్పాల్సిన పని లేదు. కావాలంటే మీరూ ఓసారి ట్రై చేసి చూడండి.