Begin typing your search above and press return to search.

ఫేస్‌బుక్ అధినేత కొత్త నిర్ణ‌యం

By:  Tupaki Desk   |   19 Jun 2015 3:59 PM GMT
ఫేస్‌బుక్ అధినేత కొత్త నిర్ణ‌యం
X
ఫేస్‌బుక్ పేరుతో ఇంట‌ర్నెట్లో దుమ్ము రేపుతున్న మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ త‌న‌దైన శైలిలో మ‌రోమారు ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. కాలేజీ విద్యార్థిగా ఉండి ఫేస్‌బుక్‌ను ప్రారంభించిన జుక‌ర్ బ‌ర్గ్ త‌న‌లాంటి విద్యార్థుల కోసం కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. అదికూడా అందరి మ‌న‌సుల‌ను చూరగొనేది కావ‌డం గ‌మ‌నార్హం.

అమెరికా అంటేనే విద్యా, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల‌కు మారుపేరు. ఉద్యోగం కోసం వ‌చ్చేవారికి అప్ప‌టికే ఉద్యోగ అవ‌కాశాలు ఖ‌రారు అయి ఉంటాయి. ఇక ఉపాధి కోసం వ‌చ్చేవారు ఒక స్ప‌ష్ట‌త‌తోనే వ‌స్తారు. మిగిలింది యువ విద్యార్ధులు. ఈ కోటాలోని వారికి స‌రిప‌డ సొమ్ములు లేకుంటే స‌మ‌స్యే క‌దా. అలాంటి వారికోసం, ఉన్న‌త చ‌దువును అభ్య‌సించాల‌నుకునే వారికోసం జుక‌ర్‌బ‌ర్గ్ కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు.


ది డ్రీమ్‌.యుఎస్ పేరుతో ఫండ్ ను ప్రారంభించారు. ఫేస్‌బుక్‌ సిఇఓ మార్క్‌ జుకర్‌బెర్గ్‌, ఆయన సతీమణి ప్రిసిలా చాన్ ల నేతృత్వంలోని న‌డిపించే ఈ ఫండ్‌కు వారు 50 లక్షల డాలర్లను స్కాలర్‌షిప్‌ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారు. అమెరికాలో న్యాయవాద విద్యను అభ్యసించడానికి వ‌చ్చే వారికి ఈ ఫండ్‌నుంచి స్కాలర్‌షిప్‌లు ఇస్తారు. ది డ్రీమ్‌.యుఎస్‌ ఫండ్‌ నాలుగేళ్ల కాలేజి విద్యకు అర్హులైన ఒక్కొక్క విద్యార్థికి 25వేల డాలర్లు చెల్లిస్తుంది. జుకర్‌బెర్గ్‌ వితరణం వల్ల శాన్‌ఫ్రాన్సిస్కోలో సుమారు 400 మంది ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశం కలుగుతుంది.

త‌ను ఈ ఫండ్ ఆలోచ‌న ఎందుకు చేసింది కూడా జుక‌ర్‌బ‌ర్గ్‌ వివ‌రించారు. ఎక్కడెక్కడినుంచో వచ్చినవారే అమెరికా సమాజాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డుపుతున్నార‌ని, ఇంకా ఎందరో ఇక్కడికి వస్తారని ఆశాభావం వ్య‌క్తం చేశారు. వారి కలలు నెరవేరే విధంగా అవకాశాలు కల్పిస్తే అది అంతిమంగా అమెరికా దేశానికి, సమాజానికి ఎంతో ఉపకరిస్తుందనిచ అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు.

మొత్తంగా... ఫేస్‌బుక్ పేరుతో ప్ర‌పంచాన్ని ఒక్క‌టి చేసిన జుక‌ర్ బ‌ర్గ్ మ‌రోమారు తాను విశ్వ‌మాన‌వుడిని అని నిరూపించుకున్నారు.