ఢిల్లీ హైకోర్టు భలే పాయింట్ బయటకు తీసింది

Fri Jul 31 2015 10:13:08 GMT+0530 (IST)

ఎవరికి వారు వేలం వెర్రిగా.. ఒక ప్రవాహంలో కొట్టుకుపోతున్న తీరుకు బ్రేకులు వేసేలా ఢిల్లీ హైకోర్టు ఒక ప్రశ్న వేసింది. తాజాగా ఢిల్లీ హైకోర్టు వేసిన ప్రశ్నపై దృష్టి పెడితే.. ఆసక్తికరమైన అంశాలు అర్థం కావటమే కాదు.. ఎంత భారీ నష్టం వాటిల్లుతుందో ఇట్టే అర్థమవుతుంది. అంతేకాదు.. సొంతం మీద దృష్టి సారించాలన్న భావన కలుగుతుంది.

ఇంతకీ ఢిల్లీ హైకోర్టు సంధించిన ఆ ఆసక్తికరమైన ప్రశ్న ఏమిటంటే..

డిజిటల్ యుగంలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న ఫేస్ బుక్.. ట్విట్టర్ లాంటి సోషల్ నెట్ వర్క్స్ కు.. ప్రభుత్వ శాఖలకు మధ్యనున్న ఒప్పందాలు ఏమిటంటూ ప్రశ్నించింది. అంతేకాదు.. వీటిల్లో పోస్ట్ చేసిన సమాచారంపై ఆయా వెబ్ సైట్లకు మేథోసంపత్ హక్కులు ఉన్నాయా? అన్న కీలక ప్రశ్నతో పాటు.. లైసెన్స్ లు ఏమైనా కలిగి ఉన్నాయా? అన్న విషయాన్ని వెల్లడించాలంటూ ఆదేశాలు జారీ చేశాయి.

ఏ నిబంధనల ఆధారంగా కేంద్ర శాఖలు సోషల్ మీడియాలో ప్రభుత్వ శాఖలు తమ ఖాతాల్ని స్టార్ట్ చేస్తున్నాయన్న ప్రశ్నను సంధించింది. పోస్ట్ చేసిన సమాచారంపై మేథోసంపత్తి హక్కులు పొందుతున్న సామాజిక మాధ్యమాలు.. ప్రభుత్వ శాఖలకు ఎలాంటి రాయల్టీ చెల్లించటం లేదన్న విషయాన్ని గుర్తించాలన్న విలువైన సూచన చేసింది.

ఢిల్లీ పోలీస్.. ఇండియన్ రైల్వేస్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు.. సోషల్ మీడియాలో అకౌంట్లు తెరవటాన్ని వ్యతిరేకిస్తూ.. దాఖలైన పిటీషన్ విచారణ సందర్భంగా  ఈ ఆసక్తికర ప్రశ్నలి సంధించింది. మరి.. వీటికి ప్రభుత్వాలు ఎలాంటి సమాధానాన్ని ఇస్తాయో చూడాలి.