విల్లా విత్ ఇన్ త్రీ అవర్స్!

Tue Jul 21 2015 11:24:35 GMT+0530 (IST)

సింగిల్ బెడ్ రూం డబుల్ బెడ్ రూం త్రిబుల్ బెడ్ రూం డూప్లెక్స్ హౌస్ విల్లా ఇలా ఏ ఇళ్లు కట్టుకోవాలన్నా... తక్కువలో తక్కువ ఎంత సమయం పడుతుంది! మనం కట్టించుకుంటే సుమారు 2 నెలలు అదే కాంట్రాక్టర్ కి ఇస్తే కాస్త అటూ ఇటూగా నెల! కానీ... మాంచి అందమైన విల్లాను అతి తక్కువ టైంలో... అంటే కేవలం గంటల్లో కట్టేసింది ఒక ఇంజినీరింగ్ కంపెనీ! ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం! ఎందుకంటే టెక్నాలజీలో ఎప్పుడూ ముందుండటానికి తపన పడే చైనా ఇంజినీర్లు ఈ పని చేసి చూపించారు!

వివరాల్లోకి వెళితే... అతి తక్కువ సమయంలో విల్లా ను నిర్మించాలని కంకణం కట్టుకుని టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కాలనుకున్న చైనాకు చెందిన ఒక ఇంజినీరింగ్ కంపెనీ 3 గంటల్లో ఒక 3డీ ప్రింట్ టెక్నాలజీతో కూడిన విల్లాను నిర్మించింది! ఇందుకు చైనాలోని షాంక్సీ ప్రాంగణం వేదికైంది! 3 డీ ప్రింటెడ్ టెక్నాలజీతో నిర్మించిన హాలు బెడ్ రూం రెస్ట్ రూం కిచెన్ కలిగిన ఈ విల్లాను క్రేన్ ల సాయంతో 3 గంటల్లో ఫినిష్ చేసేశారు!

అయితే ఇంత తొందరగా కట్టే ఈ విల్లాలకు రేటు ఎంతవుతుందో కూడా లెక్కచెప్పేశారు. ఈ విల్లాలని నిర్మించడానికి ఒక్కో చదరపు మీటరుకూ 400 - 480 డార్లు ఖర్చవుతుందట! అయితే 3 గంటల్లో విల్లాను నిర్మించారని సంబరాలు చేసుకుంటుంటే... ఈ సమయంలో కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి! ఈ విల్లాలు విపత్తులను తట్టుకోగలవా? క్వాలిటీ ఏ రేంజ్ లో ఉంటుంది? మామూలు ఇళ్లలో ఉన్నంత ధైర్యంగా వీటిలో నివసించొచ్చా? వీటి లైఫ్ టైం ఎంత ఉంటుంది? వంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి! ఈ ప్రశ్నలకు కూడా సదరు ఇంజినీరింగ్ కంపెనీ సంతృప్తికరమైన సమాదానాలు చెప్పగలిగితే మాత్రం... ఈ ప్రాజెక్టు సూపర్ హిట్టే!