Begin typing your search above and press return to search.

స్లో పేస్.. స్పీడ్ పేస్.. ఆ జట్టు విజయ రహస్యమిదే

దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఐపీఎల్ టైటిల్ ను ఐదుసార్లు కొట్టిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్.

By:  Tupaki Desk   |   15 April 2024 4:30 PM GMT
స్లో పేస్.. స్పీడ్ పేస్.. ఆ జట్టు విజయ రహస్యమిదే
X

అదేంటి..? క్రికెట్ లో స్లో పేస్.. స్పీడ్ పేస్ ఉంటాయా..? ఒకవేళ పేసర్ల గురించి చెప్పాల్సి వస్తే మీడియం పేసర్ అనో, మీడియం ఫాస్ట్ అనో, ఫాస్ట్ అనో వర్గీకరిస్తారు తప్పితే.. ఈ స్లో పేస్ ఏంటి? స్పీడ్ పేస్ ఏంటి అనుకుంటున్నారా? ఇందులో పెద్ద విషయమే ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్టు తాజా విజయ రహస్యమూ దాగుంది.

కుడి-ఎడమల కాంబినేషన్ తో

దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఐపీఎల్ టైటిల్ ను ఐదుసార్లు కొట్టిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. పాత ఆటగాళ్లతోనే ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించడం చెన్నై గొప్పదనం. ‘‘అంకుల్స్ ఆర్మీ’’ అంటూ ఎగతాళి చేసినా 2021లో లీగ్ విజేతగా నిలిచింది చెన్నై. 2022లో ఘోరంగా విఫలమైనా 2023లో తిరిగి కప్ కొట్టింది. అలాంటి చెన్నై ఈ సీజన్ లోనూ చక్కగా ఆడుతోంది. 6 మ్యాచ్ లలో 4 విజయాలు సాధించింది. ఆ జట్టు గెలుపులో బ్యాటర్ల పాత్ర ఎంత ఉందో ఇద్దరు పేసర్ల పాత్ర కూడా అంతే ఉంది. వైవిధ్యమైన బౌలింగ్ తో ప్రత్యర్థి బాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్న వారిద్దరూ ఎడమచేతి వాటం పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్), కుడిచేతివాటం పేసర్ మతీశ పతిరన (శ్రీలంక).

ఫిజ్.. మరీ స్పిన్నర్ లా..

బంగ్లాదేశ్ కు చెందిన ముస్తాఫిజుర్ ప్రస్తుత లీగ్ కు రావడానికి ముందు ఆడిన సిరీస్ లో విఫలమయ్యాడు. కానీ, ఇప్పుడు మాత్రం అదరగొడుతున్నాడు. ఫిజ్ అంటూ సహచరులు ముద్దుగా పిలుచుకునే అతడు.. పేసర్ అయినప్పటికీ ఆ వేగాన్ని ప్రతిసారీ చూపడు. ఎక్కువసార్లు 120 కిలోమీటర్ల వేగంతోనే బంతులేస్తాడు. ఒక్కోసారి ఇది 115-116 కిలోమీటర్లకు పరిమితం అంటే నమ్మాల్సిందే. ఈ స్లో పేస్ తోనే అతడు ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందిపెడుతుంటాడు. అలాగని ముస్తాఫిజుర్ 130-135 కి.మీ. వేగానికి పరిమితం అయ్యే మీడియం పేసర్ ఏమీ కాదు. అవసరమైతే 140 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులేయగలడు. కానీ, స్లో పేస్ నే ఎక్కువ నమ్ముతుంటాడు. దాంతోనే ఫలితాలూ రాబడుతున్నాడు.

మరో మలింగ.. పతిరన

శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరన వేగంలోనే కాదు బంతి విసిరే శైలిలోనూ ఆ దేశ మాజీ పేసర్ మలింగను తలపిస్తాడు. 150 కిలోమీటర్ల వేగాన్ని అలవోకగా అందుకునే పతిరన.. మలింగలా యార్కర్లు వేయడంలో దిట్ట. ఆదివారం నాటి ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో గెలుపు –ఓటమి మధ్య అంతరం పతిరననే. నాలుగు వికెట్లు పడొట్టి కేవలం 28 పరుగులే ఇచ్చిన అతడు.. భీకర టచ్ లో ఉన్న రోహిత్ శర్మనూ కట్టిపడేశాడు. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లోనూ పతిరన 150 కిలోమీటర్ల వేగంతో వేసిన యార్కర్లు మిచెల్ మార్ష్, ట్రిస్టన్ స్టబ్స్ వికెట్లను గిరాటేశాయి. ప్రతి బంతిని 145 కిలోమీటర్ల పైగా వేగంతో వేయగల సత్తా పతిరన సొంతం. అందుకే ఇతడిని ధోనీ తనదైన శైలిలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకుంటున్నాడు. ఇదీ.. స్లో పేస్.. స్పీడ్ పేస్ కథ..