Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకెన్నాళ్లకు ఐపీఎల్ లో తెలుగు హిట్టర్.. ఎవరీ నితీశ్ రెడ్డి?

సంప్రదాయ ఆటను ఫాలో అయ్యే తెలుగు క్రికెటర్ల బ్యాటింగ్ లో దూకుడు ఉండదు. దీంతోనే ఐపీఎల్ వంటి టి20లీగ్ లో మనవారి పేరు వినిపించదు.

By:  Tupaki Desk   |   10 April 2024 4:45 AM GMT
ఎన్నాళ్లకెన్నాళ్లకు ఐపీఎల్ లో తెలుగు హిట్టర్.. ఎవరీ నితీశ్ రెడ్డి?
X

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మొత్తం పది జట్లు.. దేశంలోని అన్ని రాష్ట్రాల క్రికెటర్లు వీటిలోఉన్నారు. అయితే, వీరు సొంత రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించకున్నా, తమదైన శైలి ఆటతో అలరిస్తున్నారు. ఢిల్లీకి చెందిన కోహ్లి బెంగళూరుకు, ధావన్ పంజాబ్ కు, జార్ఖండ్ కు చెందిన ధోని చెన్నైకు, పంజాబ్ కు చెందిన శుబ్ మన్ గిల్ గుజరాత్ కు ఆడుతున్నారు. రోహిత్ శర్మ మాత్రమే సొంత రాష్ట్రం ఫ్రాంచైజీ ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇలా చెప్పుకొంటూ పోతే చాలామంది ఉన్నారు. అయితే, తెలుగువారు ఇదిగో మా రాష్ట్రం ఆటగాడు దుమ్ము రేపుతున్నాడు చూడు.. అని గొప్పలు పోయేందుకు మాత్రం ఇన్నాళ్లూ అవకాశం లేకపోయింది.

అప్పట్లో లక్ష్మణ్.. మొన్నటిదాక రాయుడు

సంప్రదాయ ఆటను ఫాలో అయ్యే తెలుగు క్రికెటర్ల బ్యాటింగ్ లో దూకుడు ఉండదు. దీంతోనే ఐపీఎల్ వంటి టి20లీగ్ లో మనవారి పేరు వినిపించదు. తెలుగు రాష్ట్రాల నుంచి గొప్ప బ్యాట్స్ మన్ అయిన వీవీఎస్ లక్ష్మణ్ మొదట్లో దక్కన్ చార్జర్స్ కు ఆడాడు. టెస్టు స్పెషలిస్ట్ గా ముద్రపడడంతో లక్ష్మణ్ టీమిండియా తరపున వన్డేలూ పెద్దగా ఆడలేదు. మరో ప్రతిభావంతుడైన బ్యాట్స్ మన్ అంబటి రాయుడు బ్యాటింగ్ లో దూకుడు ఉంటుంది. అయితే, అది సంప్రదాయ దూకుడు. ఇక వైజాగ్ కు చెందిన టీమిండియా మాజీ ఆటగాడు వేణుగోపాలరావు దక్కన్ చార్జర్స్ కు ఆడినా పెద్దగా రాణించలేదు. మరోవైపు రాయుడు ముంబై, చెన్నైకి మాత్రమే ఆడాడు. దక్కన్ చార్జర్స్, ఇప్పటి సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆడలేదని సంగతి గుర్తుంచుకోవాలి. హనుమ విహారి, కేఎస్ భరత్ తదితర టీమిండియా మాజీలకు ఐపీఎల్ లో చోటే లేదు.

ముంబై తరఫున మెరుస్తున్న తిలక్ వర్మ

ఈ తరం ఆట అయిన టి20లకు తగిన దూకుడు హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ సొంతం. టీమిండియా టి20 జట్టులో 20 ఏళ్ల తిలక్ రెగ్యులర్ సభ్యుడు అయ్యే చాన్సుంది. అయితే, ఇతడిని ముంబై ఇండియన్స్ తీసుకుంది. ఆ జట్టు తరఫున తిలక్ దుమ్మురేపుతున్నాడు. మరి మరో తెలుగు బ్యాట్స్ మన్ ఎవరూ ఐపీఎల్ లో సత్తా చూపలేరా? ఇకపైన అయినా వస్తారా? అనే ప్రశ్నలకు సమాధానంగా దొరికాడు నితీశ్ కుమార్ రెడ్డి.

పంజాబ్ పై పంజా

పంజాబ్ కింగ్స్ తో మంగళవారం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున అదరగొట్టాడు తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (64; 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 ఫోర్లు). సన్ రైజర్స్ లో ఇతడిదే కీలక ఇన్నింగ్స్. ఫామ్ లో ఉన్న ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (21), అభిషేక్ శర్మ (16) తక్కువ పరుగులే చేసినా.. దూకుడైన మార్‌క్రమ్‌ (0), క్లాసెన్ (9), రాహుల్ త్రిపాఠి (11) విఫలమైనా నితీశ్ కుమార్ రెడ్డి మాత్రం దుమ్మురేపాడు. 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన హైదరాబాద్‌ ను ఆదుకున్నాడు. 32 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. లీగ్ లో అతడికిదే తొలి అర్ధశతకం. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 180 పరుగులు చేయగలిగిందంటే అది నితీశ్ కారణంగానే.

హిట్టింగ్ సూపర్.. మంచి మీడియం పేసర్

చెన్నైతో జరిగిన గత మ్యాచ్ లో నితీశ్ (14 నాటౌట్) సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించిన తీరు చూశాక అతడిలో హిట్టర్ ఉన్నాడని స్పష్టం అవుతోంది. అతడి బ్యాటింగ్ స్టయిల్ కూడా బాగుంది.

పంజాబ్ తో మ్యాచ్ ద్వారా తనను మరింత నిరూపించుకున్నాడు ఈ విశాఖపట్టణం కుర్రాడు. అంతేకాదు మీడియం పేస్ బౌలింగ్ ఒక వికెట్ కూడా పడగొట్టాడు. పంజాబ్ తో మ్యాచ్ లో నితీశ్ కొట్టిన సిక్స్ లన్నీ క్లీన్ హిట్టింగ్. భారీ సిక్స్ లే కావడం విశేషం. 20 ఏళ్ల నితీశ్ మరింత మెరుగుపడితే తెలుగు రాష్ట్రాల నుంచి మరో క్రికెటర్ ను టీమిండియాలో చూడొచ్చు.