Begin typing your search above and press return to search.

0, 3, 28, 0, 1, 0.. ఐపీఎల్ నుంచి ఆ ప్లేయర్ ‘ఔట్’

భారతీయ అల్లుడైన మ్యాక్స్ వెల్ ఈ సీజన్ లో మహా దండగ అని మూడు రోజుల కిందటే ‘తుపాకీ’ మీడియా చెప్పింది. ఇప్పుడు అదే జరిగింది.

By:  Tupaki Desk   |   16 April 2024 7:02 AM GMT
0, 3, 28, 0, 1, 0.. ఐపీఎల్ నుంచి ఆ ప్లేయర్ ‘ఔట్’
X

భారతీయ అల్లుడైన మ్యాక్స్ వెల్ ఈ సీజన్ లో మహా దండగ అని మూడు రోజుల కిందటే ‘తుపాకీ’ మీడియా చెప్పింది. ఇప్పుడు అదే జరిగింది.

గాయం సలుపుతున్నా నాణ్యమైన స్పిన్నర్లను ఎదుర్కొంటూ 200 (నాటౌట్) పరుగుల సంచలన ఇన్నింగ్స్ ఆడిన పిచ్ పై రెండో బంతికే డకౌట్.. ఎంతటి ఫాస్ట్ బౌలింగ్ లోనైనా తనదైన షాట్లతో సిక్స్ లు కొట్టేవాడు.. పేలవమైన టైమింగ్ తో క్లీన్ బౌల్డ్.. ఫినిషర్ గా జట్టుకు ఉపయోగపడతాడనుకుంటే కనీసం టెయిలెండర్ లాగా కూడా ఆడడం లేదు.. అసలు అతడికి ఏమైంది..? ఏమైనా మానసిక సమస్యలా...? ఔపు దాదాపు అదే కారణం.

కొన్నాళ్లు ఆడను..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో దారుణ పరాజయాలు ఎదుర్కొంటోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ). మరీ సోమవారం నాటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఐపీఎల్ లో అత్యంత భారీ స్కోరు (287) ఇచ్చుకుంది. అయితే, బెంగళూరు సైతం 262 పరుగులు చేసి దీటుగానే బదులిచ్చింది. కానీ, ఈ మ్యాచ్ లో కీలక ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ ను ఆడించలేదు. దినేశ్ కార్తీక్ (83) గట్టిగా పోరాడినా ఫలితం దక్కలేదు. ఇలాంటి సమయంలో మ్యాక్స్‌ వెల్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

మానసిక సమస్యల కారణంగా లీగ్‌ నుంచి రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. హైదరాబాద్‌ చేతిలో ఓటమి అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘హైదరాబాద్‌ తో మ్యాచ్‌ కు ముందు నేను కెప్టెన్‌ డుప్లెసిస్‌, కోచ్‌ తో నా బదులు మరో ఆటగాడిని తీసుకొమ్మన్నా. కొంతకాలంగా ఫామ్‌ లో లేను. జట్టుకు విజయాలను అందించలేకపోయా. మానసికంగా, శారీరకంగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. అలాగైతేనే ఫిట్‌ గా తిరిగొస్తా’’ అని తెలిపాడు. లీగ్ లో తన అవసరం ఉంటే.. తప్పకుండా బలంగా తిరిగొస్తానని కూడా ప్రకటించాడు.

ఎప్పుడు తిరిగొస్తాడో..?

ఐపీఎల్ 17వ సీజన్ నుంచి మ్యాక్స్ వెల్ నిరవధిక విరామం తీసుకుంటున్నట్లు మ్యాక్సీ చెప్పాడు. 6 మ్యాచ్‌ లలో 32 పరుగులే చేసిన అతడు మూడుసార్లు డకౌట్ అయ్యాడు. చెన్నైతో తొలి మ్యాచ్‌ లో మరీ గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. దీంతో హైదరాబాద్‌ తో మ్యాచ్‌ నుంచి స్వయంగా తప్పుకొన్నాడు. అయితే, మళ్ళీ వచ్చేది ఎప్పుడనేది సందిగ్ధమే. 2019లో ఇలానే మ్యాక్సీ మానసిక సమస్యల కారణంగా తప్పుకొన్నాడు.