Begin typing your search above and press return to search.

అతడు ఆడితే అంతే.. లేటు వయసులో యమా జోరు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గురువారం జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ చేతిలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఓడిపోయింది.

By:  Tupaki Desk   |   12 April 2024 9:56 AM GMT
అతడు ఆడితే అంతే.. లేటు వయసులో యమా జోరు
X

28 నాటౌట్, 38 నాటౌట్, 20, 53 నాటౌట్.. ఇవేవో ఓ కుర్ర బ్యాటర్ స్కోర్లు కావు.. అలాగని వెటరన్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాట్ నుంచి వచ్చిన పరుగులు కాదు.. 39 ఏళ్లకు దగ్గరగా ఉన్న.. 20 ఏళ్ల అంతర్జాతీయ అనుభవం ఉన్న క్రికెటర్.. ఐపీఎల్ డెత్ ఓవర్లలో చేసిన పరుగులు. జాతీయ జట్టుకు దూరమైన అతడు.. లీగ్ క్రికెట్ లో అదరగొడుతున్నాడు. దీంతో వచ్చే టి20 ప్రపంచ కప్ నకు ఎంపిక చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.

బెంగళూరు ఓడింది.. అతడు గెలిచాడు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గురువారం జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ చేతిలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఓడిపోయింది. కానీ, వెటరన్ దినేశ్ కార్తీక్ మాత్రం అదరగొట్డాడు. ఆచితూచి ఆడడం కాదు.. కొలతలు వేసి మరీ కొట్టాడా? అన్నట్లు ఫీల్డర్ల మధ్య నుంచి బంతిని పంపాడు. కోహ్లి వంటి భీకర ఫామ్ లో ఉన్న బ్యాట్స్ మన్ తొందరగానే ఔటైనా.. బెంగళూరు 196 పరుగులు చేయడానికి కారణం కార్తీకే. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అతడు.. బుమ్రానూ బాదేశాడు. 16వ ఓవర్‌ లో (ఆకాశ్‌ మధ్వాల్‌) నాలుగు ఫోర్లు కొట్టాడు. 23 బంతుల్లో 53 నాటౌట్ (5 ఫోర్లు, 4 సిక్స్ లు)తో కార్తీక్ కిరాక్ ఇన్నింగ్స్ ఆడాడు. కాగా, మధ్వాల్ బౌలింగ్ లో అతడు కొట్టిన షాట్లన్నీ ఔరా అనిపించాయి. ఆఫ్ స్టంప్ ఆవల వేసిన రెండో బంతిని థర్డ్‌ మ్యాన్‌ దిశగా, నాలుగో, ఐదో బంతులను స్కూప్‌ తో కీపర్, షార్ట్‌ థర్డ్‌ ఫీల్డర్‌ మీదుగా బౌండరీకి పంపాడు.

ఫినిషర్ మళ్లీ వచ్చాడు..

కార్తీక్ ఆట చూసినవారు ఫినిషర్ మళ్లీ వచ్చాడు.. అని పొగిడేస్తున్నారు. అతడిని టి20 ప్రపంచ కప్ నకు ఎంపిక చేయాలని కోరుతున్నారు. వికెట్ కీపర్-బ్యాటర్ గా కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్ లలో ఎవరికి ఓటు వేస్తారని క్రికెట్ వెబ్ సైట్లు పోటీ పెడుతున్నాయి. వాస్తవానికి 2022 చివర్లో జరిగిన టి20 ప్రపంచకప్ అనంతరం కార్తీక్ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. నాడు ప్రపంచ కప్ లో విఫలం కావడంతో అతడికి మళ్లీ పిలుపురాలేదు. ఈలోగా కామెంటేటర్ అవతారమెత్తాడు. అయితే, దేశవాళీల్లో మాత్రం సొంత రాష్ట్రం తమిళనాడుకు ఆడుతూ తన నిబద్ధత చాటుతున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ ద్వారా మరోసారి తన పేరు వినిపించేలా చేస్తున్నాడు.