Begin typing your search above and press return to search.

ఉప్పల్ స్టేడియం ప్రపంచకప్ కు పనికి రాదా?

By:  Tupaki Desk   |   22 July 2015 9:27 AM GMT
ఉప్పల్ స్టేడియం ప్రపంచకప్ కు పనికి రాదా?
X
దేశంలోని అత్యుత్తమ క్రికెట్ స్టేడియాల్లో ఒకటని హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానాన్ని చెబుతుంటారు. ముఖ్యంగా మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారానికి ఉప్పల్ స్టేడియంలో ఉన్నంత సౌకర్యంగా ఇంకెక్కడా ఉండదని బ్రాడ్ కాస్టర్లు అంటుంటారు. ఇక మన జనాల క్రికెట్ అభిమానం గురించి చెప్పాల్సిన పని లేదు. అది ఇండియా ఆడే టెస్టు మ్యాచ్ అయినా సరే.. ఐపీఎల్ మ్యాచ్ అయినా సరే.. స్టేడియం నిండిపోవాల్సిందే. హైదరాబాద్ లో మ్యాచ్ జరిగినపుడు స్టార్ ఆటగాళ్లు కూడా ఇక్కడి జనాల ఉత్సాహం చూసి ఆశ్చర్యపోతుంటారు. మరి క్రికెట్ అంటే ఇంత అభిమానం ఉన్న జనాలకు ఒక ప్రపంచకప్ మ్యాచ్ చూపిస్తే బీసీసీఐ సొమ్మేం పోతుందో మరి.

వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నెలల్లో టీ20 ప్రపంచకప్ భారతే ఆతిథ్యమివ్వబోతోంది. భారత్ లో పొట్టి ప్రపంచకప్ జరగబోతుండటం ఇదే తొలిసారి. టోర్నీ ఆతిథ్యం కోసం 8 వేదికల్ని ఎంపిక చేసింది బీసీసీఐ. కానీ అందులో హైదరాబాద్ లేదు. దేశంలోని ప్రముఖ నగరాల్లో హైదరాబాద్ ఒకటైనా ప్రపంచకప్ ఆతిథ్యానికి ఉప్పల్ స్టేడియం పనికి రాలేదు పక్కన చెన్నైలో, బెంగళూరులో మ్యాచ్ లు ఉన్నాయి. ఉత్తర భారతంలో ధర్మశాల, మొహాలి లాంటి చిన్న నగరాలకు కూడా ఛాన్స్ ఇచ్చారు. కానీ హైదరాబాద్‌కు మాత్రం అవకాశం ఇవ్వలేదు. మహారాష్ట్రలోని ముంబయి నగరాన్ని ఒక వేదికగా ఎంపిక చేస్తే చాలదా. అదే రాష్ట్రంలో నాగ్ పూర్ కు కూడా అవకాశమిచ్చింది బీసీసీఐ. మరి హైదరాబాద్ ఏం తప్పు చేసిందో. ఎన్నో అంతర్జాతీయ, ఐపీఎల్ మ్యాచ్ లను సమర్థంగా నిర్వహించిన ఘనత ఉన్న ఉప్పల్ స్టేడియాన్ని బోర్డు ఎందుకు చిన్న చూపు చూస్తోందో ఏమో మరి. నాలుగేళ్ల కిందట వన్డే వరల్డ్ కప్ సమయంలోనూ హైదరాబాద్ కు నిరాశ తప్పలేదు. 1996 ప్రపంచకప్ లో ఒక మ్యాచ్ కు మాత్రం హైదరాబాద్ ఆతిథ్యమిచ్చింది. ఆ మ్యాచ్ జరిగింది ఎల్బీ స్టేడియంలో. ఐతే అది ఇండియా మ్యాచ్ కాదు. వెస్టిండీస్-జింబాబ్వే మ్యాచ్. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా వచ్చే క్రికెట్ ఆదాయం మాత్రం బీసీసీఐకి కావాలి. ఇక్కడి జనాలకు ప్రపంచకప్ మ్యాచ్‌ లు ప్రత్యక్షంగా చూసే ఛాన్స్ మాత్రం ఇవ్వదు.