Begin typing your search above and press return to search.

వింబుల్డన్‌లో ఈసారి భలే మజా..

By:  Tupaki Desk   |   27 Jun 2015 11:45 AM GMT
వింబుల్డన్‌లో ఈసారి భలే మజా..
X
టెన్నిస్ ప్రియులకు గ్రాండ్ స్లామ్ టోర్నీ వచ్చిందంటే పండగే. అందులోనూ గ్రాండ్‌స్లామ్‌లకే గ్రాండ్‌స్లామ్ అనదగ్గ వింబుల్డన్ అంటే ఏ టెన్నిస్ ప్రియుడైనా సంబరాల్లో మునిగిపోతాడు. ప్రపంచంలో అత్యధికంగా చూసే టెన్నిస్ టోర్నీ ఇదే. ఆటగాళ్లకు కూడా ఇది ప్రతిష్టాత్మక టోర్నీ కావడంతో తమ సామర్థ్యానికి మించి ప్రదర్శన చేయాలని చూస్తారు. అందుకే ఇక్కడ రసవత్తర పోరాటాలు జరుగుతుంటాయి. టోర్నీ ఆసక్తికరంగా సాగుతుంది. ఐతే ఈసారి వింబుల్డన్ మరింత రసవత్తరం కాబోతోంది. దీనికి కారణం ఆసక్తి రేపుతున్న డ్రానే.

ఫెదరర్, నాదల్, జకోవిచ్, ముర్రే.. గత దశాబ్ద కాలంగా వీళ్లదే టెన్నిస్‌లో హవా. బిగ్-4గా గుర్తింపు తెచ్చుకున్న ఈ నలుగురిలో ఏ ఇద్దరు తలపడినా పోరు రసవత్తరంగా ఉంటుంది. ఐతే చాలా ఏళ్లుగా జరుగుతున్నదేంటంటే.. ఈ నలుగురిలో ఇద్దరు ఓవైపు.. ఇంకో ఇద్దరు మరోవైపు ఉండేలా డ్రా పడుతుంటుంది. కానీ ఈ మధ్య వీళ్ల ర్యాంకుల్లో చాలా మార్పులొచ్చిన నేపథ్యంలో ఈసారి వింబుల్డన్‌లో మాత్రం నలుగురిలో ముగ్గురు ఒకే పార్శ్వంలో పడ్డారు. జకోవిచ్ మరోవైపు ఉండగా..మిగతా ముగ్గురు ఒకే పార్శ్వంలో ఉన్నారు. అంటే ఈ ముగ్గురిలో ఒక్కరు మాత్రమే ఫైనల్ చేరే అవకాశముందన్నమాట. ఫైనల్‌ లోపే ఒకరితో ఒకరు తలపడబోతున్నారు. మరి ముగ్గురిలోంచి ఫైనల్ చేరేదెవ్వరన్నది ఆసక్తికరం. మరోవైపు జకోవిచ్‌కు కూడా ఫైనల్ చేరడం అంత ఈజీయేమీ కాదు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అతడికి షాకిచ్చిన వావ్రింకా సెమీస్‌లోపే అతడికి ఎదురవుతాడు. కాబట్టి ఈసారి వింబుల్డన్ రసవత్తరంగా సాగడం ఖాయం.