Begin typing your search above and press return to search.

కోహ్లి.. భలే కవర్ చేశాడుగా

By:  Tupaki Desk   |   3 Aug 2015 8:36 AM GMT
కోహ్లి.. భలే కవర్ చేశాడుగా
X
విరాట్ కోహ్లి.. ధోని టైపు కాదని మొదట్నుంచి తెలుస్తూనే ఉంది. అతను ధోని కంటే కొంచెం భిన్నంగా ఉండటం కాదు, ధోనికి క్వయిట్ ఆపోజిట్ అని చెప్పాలి. ధోని మైదానంలో ఎంత ప్రశాంతంగా కనిపిస్తాడో.. కోహ్లి అంత అగ్రెసివ్ గా ఉంటాడు. మాటలో కానీ, నిర్ణయాల్లో కానీ ధోనితో కోహ్లికి అస్సలు పోలికే ఉండదు. వీళ్లిద్దరి మధ్య వైరుధ్యాలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ధోని ఏదైనా ఆచితూచి మాట్లాడతాడు, నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ కోహ్లిదంతా ధనాధన్ ఫటాఫట్ అన్నట్లుంటాడు. అవసరమైతే ఎవరిమీదైనా విమర్శలు చేయడానికి, సెటైర్లు వేయడానికి సిద్ధంగా ఉంటాడు కోహ్లి. బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా ఇలా మాట్లాడే పెద్ద వివాదం రాజేశాడు విరాట్.

బంగ్లాదేశ్ చేతిలో వరుసగా రెండు వన్డేల్లో ఓడి సిరీస్ కోల్పోయినపుడు టీమ్ ఇండియాపై, ధోనీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ సందర్భంగా కోహ్లి ఊరికే ఉండకుండా.. ‘‘జట్టులో ఎక్కడో తేడా జరుగుతోంది. మేం ప్రణాళికల్ని సరిగా అమలు చేయలేకపోతున్నట్లుగా అనిపిస్తోంది’’ అంటూ అసహనంగా మాట్లాడాడు. ఐతే ప్రణాళికలు అమలు చేసేది కెప్టెనే కాబట్టి.. ధోనీనే ఫెయిలవుతున్నాడన్నట్లుగా కోహ్లి వ్యాఖ్యలు ధ్వనించాయి. దీనికి ముందు ఆస్ట్రేలియా పర్యటనలోనే కోహ్లికి, ధోనికి విభేదాలున్నట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. మీడియాలో రకరకాల కథనాలు వచ్చినా అప్పట్లో కోహ్లి తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఐతే ఎప్పుడో నెల కిందట చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు తీరిగ్గా కవర్ చేసే ప్రయత్నం చేశాడు విరాట్.

‘‘నేనా రోజు మేము అన్నానే తప్ప.. ఎవరినో టార్గెట్ చేయలేదు. మేము అన్నానంటే అందులో నేనూ ఉన్నట్లే కదా. అందరినీ కలుపుకునే ఆ వ్యాఖ్యలు చేశా’’ అంటూ కవరింగ్ చేసే ప్రయత్నం చేశాడు విరాట్. ఇలాంటిదేమైనా ఉంటే అప్పట్లోనే క్లారిటీ ఇచ్చి ఉండొచ్చు కదా. ఇన్నాళ్లు వెయిట్ చేశాడంటే.. ఆన్సర్ ప్రిపేరై వచ్చాడన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ మాటల సంగతెలా ఉన్నా ధోనికి ఇష్టుడైన జడేజాపై వేటు పడేలా చేయడం, ధోనికి నచ్చని హర్భజన్, మిశ్రాలను జట్టులోకి వచ్చేలా చేయడం ద్వారా కోహ్లి.. ధోనికి ఫిట్టింగ్ పెడుతున్న సంగతి మాత్రం బాగానే అర్థమవుతోంది.