కోహ్లి సేనకు పాకిస్థాన్ ఫిట్టింగ్

Sun Aug 02 2015 16:55:33 GMT+0530 (IST)

రెండు నెలల కిందట బంగ్లాదేశ్ చేతిలో పాకిస్థాన్ మూడు వన్డేల సిరీస్ లో చిత్తుగా ఓడింది. అప్పడు మన ఇండియన్ ఫ్యాన్స్ పాకిస్థాన్ ను చూసి జాలి పడ్డారు. కానీ పాక్ ను చిత్తు చేసిన బంగ్లా.. ఆ తర్వాత టీమ్ ఇండియాను కూడా మట్టికరిపించింది. అప్పటికి కానీ మన ఫ్యాన్స్ కి అర్థం కాలేదు.. పాకిస్థాన్ పతనం కాలేదు బంగ్లాదేశ్ ఎదిగింది అని. పాకిస్థాన్ బలమేంటో అందరికీ ఇప్పుడు తెలుస్తోంది. శ్రీలంక పర్యటనలో ఆ జట్టు విజృంభించిన తీరు చూస్తే ప్రపంచ క్రికెట్ మొత్తం విస్తుపోతోంది. అనిశ్చితికి మారుపేరైన ఆ జట్టు.. శ్రీలంకను శ్రీలంకలో టెస్టు వన్డే టీ20.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ చిత్తు చేయడం విశేషం. గత కొన్నేళ్లలో పాకిస్థాన్ ఎప్పుడైనా పెద్ద జట్లను ఓడిస్తే అది గాలి వాటం అనేసే వాళ్లు. కానీ నెలన్నర పర్యటనలో అత్యంత నిలకడగా ఆడి శ్రీలంకకు షాకుల మీద షాకులిచ్చింది పాక్.

టెస్టు సిరీస్ లో 2-1తో వన్డే సిరీస్ లో 3-2తో విజయం సాధించిన పాకిస్థాన్.. టీ20 సిరీస్ ను 2-0తో చేజిక్కించుకుంది. అందులోనూ చివరిదైన రెండో టీ20లో ఆ జట్టు విజయం అద్భుతం. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు ఓ దశలో 40 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయం దిశగా సాగింది. కానీ కెప్టెన్ అఫ్రిది (22 బంతుల్లో 45) అన్వర్ అలీ (17 బంతుల్లో 46) మెరుపులతో అనూహ్య విజయం సాధించింది. మొత్తానికి లంక పర్యటనను దిగ్విజయంగా ముగించింది పాకిస్థాన్. ఇప్పుడిక సవాలు టీమ్ ఇండియా ముందుంది. పాకిస్థాన్ చేతిలో చిత్తయిన జట్టు చేతిలో కోహ్లి సేన ఓడితే మన పరువు నిలవదు. పాక్ కు దీటైన ప్రదర్శన చేయాలి. మామూలుగా అయితే లంక చేతిలో ఓడినా అభిమానులు లైట్ తీసుకుంటారేమో కానీ.. పాకిస్థాన్ గెలిచిన తీరు చూశాక మనోళ్లు ఓడితే ఒప్పుకోరు. కాబట్టి పాకిస్థాన్ కోహ్లి సేనకు పెద్ద ఫిట్టింగ్ పెట్టిందనే చెప్పాలి. మరి కోహ్లి సేన ఏం చేస్తుందో చూడాలి.