వారు వడ్డించిన పీతల కూరకు కోహ్లీ పిధా

Thu Aug 06 2015 11:27:25 GMT+0530 (IST)

ఆటతో హడావుడి చేయటం అందరూ చేస్తుంటారు. కానీ.. తన అలవాట్లు.. పద్ధతులతో తరచూ వార్తల్లో ఉండటం టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి మాత్రమే దక్కుతుంది. ప్రపంచంలో ఎక్కడ ఏది బాగున్నా.. అక్కడకు వెళ్లే అలవాటున్న కోహ్లీ ఆ మధ్య.. తన ప్రేయసి అనుష్క శర్మను తీసుకొని ఓ నాలుగు రోజులు దక్షిణాఫ్రికాలోని ఓ రిసార్ట్ లో గుట్టుగా గడపటం.. అక్కడి వాతావరణం అద్భుతంగా ఉందంటూ.. తన కాలు మాత్రమే కనిపించే ఫోటో సోషల్ నెట్ వర్క్స్ లో పోస్ట్ చేయటం దానికి సదరు రిస్టార్ట్ చెఫ్ చేసిన కామెంట్ పుణ్యమా అని ఈ ప్రేమ జంట అక్కడ గడిపిన విషయం బయటకొచ్చిన సంగతి తెలిసిందే.

ఇలా నచ్చిన ప్రదేశానికి వెళ్లి.. అక్కడి విశేషాలను నలుగురికి చెప్పే అలవాటున్న కోహ్లీ తాజాగా తన మనసును దోచన పీతల కూర గురించి పోస్ట్ చేశాడు. శ్రీలకం క్రికెట్ దిగ్గజాలు మహేల జయవర్ధనే.. కుమార సంగక్కర సంయుక్తంగా ఓ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు.

దీనికి అనుకోని అతిధిలా వెళ్లి ఆశ్చర్యపర్చారు కోహ్లీ. వీరి రెస్టారెంట్లో ప్రత్యేకమైన పీతలతో చేసే కూర ఒకటి స్పెషల్. దాన్ని కొసరి కొసరి మరీ వడ్డించటం.. దాని రుచి అద్భుతంగా ఉండటంతో.. తాను తిన్న పీతల కూర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఇంత రుచికరమైన భోజనం ప్రపంచంలో మరెక్కడా చూడలేదన్నాడు. రెస్టారెంట్లో తాను దిగిన ఫోటోను పోస్ట్ చేసి.. కామెంట్ చేశాడు.

శ్రీలంకలో దొరికే ప్రత్యేకమైన పీతల్ని ఈ రెస్టారెంట్ లో విందుగా వడ్డిస్తారు. దీనికి శ్రీలంకలో మాంచి ఆదరణ ఉంది. దీనికి తోడు.. ఈ హోటల్ కు లంక క్రికెటర్ల దిగ్గజ ఆటగాళ్లదన్న పేరు ప్రఖ్యాతులతో సదరు రెస్టారెంట్ మాంచి ఆదరణ ఉందట. కోహ్లీ మనసు దోచిన పీతల కూర రుచి చూపించటానికి  ఈసారి జంటగా వెళతాడేమో.