Begin typing your search above and press return to search.

థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న యాషెస్

By:  Tupaki Desk   |   31 July 2015 5:36 AM GMT
థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్న యాషెస్
X
యాషెస్ సిరీస్ లో ఏ జట్టు ఫేవరెట్ అని చెప్పాలో విశ్లేషకులకు అర్థమై చావడం లేదు. ఈ మ్యాచ్ లో ఆ జట్టు ఫేవరెట్ అంటే చాలు.. ఆ జట్టుకు దిమ్మదిరిగే షాక్ తగులుతోంది. దారుణమైన ఆటతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంటోంది. సిరీస్ ఆరంభానికి ముందు అందరూ ఆస్ట్రేలియాను హాట్ ఫేవరెట్ అన్నారు. ఆ జట్టు ఏకంగా 169 పరుగుల తేడాతో ఓడింది. తొలి టెస్టు నెగ్గింది కాబట్టి.. ఇక ఇంగ్లాండే ఫేవరెట్ అన్నారు. ఆ జట్టు రెండో టెస్టులో మరీ దారుణంగా 405 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది. దీంతో ఆస్ట్రేలియా మళ్లీ డ్రైవర్ సీట్లోకి వచ్చింది. గెలుపు రుచి చూశారు కదా.. ఇక సిరీస్ లో ఆ జట్టును ఆపడం కష్టమే.. ఇంగ్లాండ్ కు ఇత్తడే అని మన సౌరభ్ గంగూలీ సహా క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఐతే ప్రస్తుతం మూడో టెస్టు జరుగుతున్న తీరు చూస్తుంటే ఆస్ట్రేలియాకు ఘోర పరాభవం తప్పదని తేలిపోయింది. తొలి రోజు ఆటతోనే ఆ జట్టు ఓటమి ఖరారైపోయింది. తొలి ఇన్నింగ్స్ లో ఆ జట్టు కేవలం 136 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ ను మరీ భారీ స్కోరేమీ చేయనివ్వకుండా 281 పరుగులకే పరిమితం చేశారు ఆస్ట్రేలియా బౌలర్లు. ఆధిక్యం 145 పరుగులే. నిజానికిది మరీ భారీ ఆధిక్యమేమీ కాదు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో బాగా ఆడితే మ్యాచ్ లో పుంజుకునే అవకాశముండేది. కానీ రెండో ఇన్నింగ్స్ లోనూ ఆ జట్టు బ్యాట్స్ మెన్ నిలవలేకపోయారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి ఓటమి బాటలో పయనిస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆధిక్యం కేవలం 23 పరుగులు. ఆ జట్టు అద్భుతంగా పోరాడి 150కి మించి టార్గెట్ పెట్టగలిగితే.. ఆ తర్వాత బౌలర్లు చెలరేగితే అద్భుతాలేమైనా జరగొచ్చేమో కానీ.. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా ఓటమి ఖాయమన్నట్లే ఉంది పరిస్థితి. మొత్తానికి మ్యాచ్ కో మలుపు తిరుగుతూ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది యాషెస్ సిరీస్.