Begin typing your search above and press return to search.

కంగారూల రివర్స్ పంచ్ మామూలుగా లేదు

By:  Tupaki Desk   |   17 July 2015 5:05 AM GMT
కంగారూల రివర్స్ పంచ్ మామూలుగా లేదు
X
యాషెస్ సిరీస్ ఆరంభం కావడానికి ముందు ఆస్ట్రేలియా హాట్ ఫేవరెట్. ఇంగ్లాండ్ ఆ జట్టుకు కనీస పోటీ అయినా ఇస్తుందా అనుకున్నారు. కానీ తొలి టెస్టులో కంగరూలకు దిమ్మదిరిగే షాక్. అనూహ్య మలుపులు తిరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించి అందరి అంచనాల్ని తలకిందులు చేసింది. యాషెస్‌లో తొలి టెస్టు నెగ్గిన వాళ్లకే సిరీస్ దక్కుతుందని చరిత్ర చెబుతుండటంతో ఆస్ట్రేలియా పనైపోయిందని అంతా అనుకున్నారు. గత మూడు పర్యాయాల్లోనూ ఇంగ్లాండ్లో యాషెస్ నెగ్గలేకపోయిన ఆస్ట్రేలియాకు ఈసారీ నిరాశ తప్పదని అంచనాకు వచ్చేశారు. ఐతే కంగారూల్ని అంత తేలిగ్గా అంచనా వేస్తే ఎలా? రెండో టెస్టు తొలి రోజు దూకుడు చూస్తే తెలుస్తుంది కంగారూల సత్తా ఏంటో.

337/1. లార్డ్స్ మైదానంలో ఆరంభమైన రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా చేసిన స్కోరిది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా రోజంతా తిరుగులేని ఆధిపత్యం చలాయించింది. ఓపెనర్ రోజర్స్ 282 బంతుల్లో 158 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 25 ఫోర్లున్నాయి. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన యువ ఆటగాడు స్టీవెన్ స్మిత్ కూడా అజేయ శతకం సాధించాడు. అతను 217 బంతుల్లో 129 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతను 13 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. మరో ఓపెనర్ వార్నర్ (38)తో కలిసి తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించిన రోజర్స్.. స్మిత్ తో కలిసి అభేద్యమైన రెండో వికెట్‌కు 259 పరుగులు జత చేశాడు. 15వ ఓవర్లో మొయీన్ అలీ వార్నర్‌ను ఔట్ చేశాక ఇంగ్లాండ్ కు మరో వికెట్ దక్కలేదు. అండర్సన్ సహా బౌలర్లందరూ విఫలమయ్యారు. రెండో రోజు కూడా ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగితే.. ఈ మ్యాచ్‌పై ఇంగ్లాండ్ ఆశలు వదులుకోవాల్సిందే. మొత్తానికి తొలి టెస్టు పరాజయం తర్వాత కంగారూ జట్టు బాగానే పుంజుకుని ప్రత్యర్థికి గట్టి రివర్స్ పంచ్ ఇచ్చింది.