మనమ్మాయి స్కోర్; 166 బంతుల్లో 350 పరుగులు

Fri Aug 07 2015 12:32:23 GMT+0530 (IST)

సెంచరీ కొడితే ఇప్పటికీ ఆనందం. అదే డబుల్ అయితే అబ్బురమే. అదే..ట్రిఫుల్ సెంచరీ అయితే.. నిజమా విస్మయం.. సాధ్యమేనా అన్న సందేహం.. ఇక.. అలాంటిది కేవలం 166 బంతుల్లో 350 పరుగులు చేస్తే? అసలు సాధ్యమేనా? అన్న సందేహం కలగొచ్చు. కానీ.. ఆ ఫీట్ ను అలవోకగా సాధించేసింది మన అమ్మాయి.

కాకపోతే ఈ అద్భుతం ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో జరగలేదు. అంతర్ జిల్లా టోర్నీలో చోటు చేసుకున్న ఈ అద్భుతం ఇప్పుడు టాక్ అఫ్ ద టౌన్ గా మారింది. ఆంధ్రా క్రికెట్ సంఘం నార్త్ జోన్ సీనియర్ మహిళల అంతర్ జిల్లా వన్డే టోర్నీలో విశాఖపట్నానికి చెందిన బ్యాట్స్ మెన్ స్నేహ దీప్తి కేవలం 166 బంతుల్లో 58 ఫోర్లు.. 11 సిక్స్ లతో ఈ భారీ స్కోర్ ని సొంతం చేసుకుంది.

పోటీ వేరు కానీ.. ఆట మాత్రం మామూలే కదా. ఈ లెక్కన చూస్తే స్నేహ దీప్తి పరుగులు అబ్బురమే. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన వైజాగ్ జట్టు 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి ఏకంగా 608 పరుగులు చేసింది. అనంతరం ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీకాకుళం జట్టు కేవలం 24.5 ఓటర్లలో 105 పరుగులకే కుప్ప కూలింది. 350 పరుగులు చేసి రికార్డు సృష్టించిన స్నేహదీప్తి బౌలింగ్ లోనూ తన సత్తా చాటి నాలుగు వికెట్లు నేలరాల్చటం గమనార్హం.