అవార్డులు ఉంటే కొత్త అవార్డు అక్కర్లేదా?

Sun Aug 02 2015 10:41:39 GMT+0530 (IST)

నచ్చినోళ్లను నెత్తిన ఎత్తుకోవటం.. నచ్చనోళ్ల విషయంలో అందుకు భిన్నంగా వ్యవహరించటం కొత్త కాదు. కానీ.. తొండి వాదనతో ఒక ప్రతిష్ఠాత్మకమైన అవార్డును దూరం చేయటానికి ప్రయత్నించిన అలిండియా టెన్నిస్ అసోసియేషన్ చేస్తున్న వాదన వింటే వింతగా అనిపించక మానదు.

తాజాగా టెన్నిస్ స్టార్ సానియామీర్జాకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు ప్రతిపాదించిన విషయానికి సంబంధించి బయటకొచ్చిన విషయాలు  విస్తుగొలిపేలా ఉన్నాయి. సాధారణంగా రాజీవ్ ఖేల్ రత్న అవార్డు కోసం అటగాళ్లను ప్రతిపాదించాల్సింది ఆయా సంఘాలు కానీ.. సానియా విషయంలో ఏఐటీఏ వ్యవహరించిన తీరు విమర్శలు రేగేలా ఉన్నాయి.

తన అద్భుతమైన ఫామ్ తో వింబుల్డన్.. ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లను గెలుచుకొని మాంచి ఊపు మీదున్న సానియామీర్జాకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు టెన్నిస్ అసోసియేషన్ ప్రతిపాదించకుండా.. కేంద్రమే చొరవ తీసుకోవటం ఆశ్చర్యం రేకెత్తిస్తోంది. దీనికి సదరు టెన్నిస్ అసోసియేషన్ చెబుతున్న మాటేమిటంటే.. ఇప్పటికే సానియా మీర్జాకు చాలానే అవార్డులు వచ్చాయని.. కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు పేరును ప్రతిపాదించలేదని చెప్పొకొచ్చింది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు సానియామీర్జా పేరును గడువు పూర్తయిన తర్వాత.. కేంద్రం తన విచక్షణ అధికారం మీద ఆమె పేరును ప్రతిపాదించిన విషయం బయటకు వచ్చింది. ఇక.. టెన్నిస్ అసోసియేషన్ వాదనపై మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఒక అటగాడు ఒక టైటిల్ గెలుచుకుంటే.. వదిలేస్తారా? అదే సమయంలో.. ఒకరికి ఒక అవార్డు ఇస్తే.. ఇక అవార్డులు ఇవ్వకూడదన్న తల తిక్క వాదనను తీసుకొచ్చిన ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ తీరు చూస్తే.. వెనువెంటనే.. ఆ అసోసియేషన్ ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్న విషయం  అర్థమవుతుంది. మరి.. దీనికి కేంద్రం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.