Begin typing your search above and press return to search.

సానియా అడక్కున్నా ఇచ్చేసేలా ఉన్నారే..

By:  Tupaki Desk   |   19 July 2015 9:14 AM GMT
సానియా అడక్కున్నా ఇచ్చేసేలా ఉన్నారే..
X
గ్లామర్ పవర్ అంటే అదే మరి. నన్ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ చేయండి ప్లీజ్ అని సానియా మీర్జా ఎవరినైనా అడిగిందా? గ్రాండ్ స్లామ్ గెలిచినపుడల్లా కోటి కొట్టమని ఎవరినైనా డిమాండ్ చేసిందా? కానీ ఆమెకు బంపర్ ఆఫర్లు తగులుతూనే ఉన్నాయి. ఈ ఆఫర్ల వెల్లువలో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం కూడా సానియా సొంతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ అవార్డుకు క్రీడాకారులే దరఖాస్తు చేసుకుంటారు. కానీ సానియా అలాంటి ప్రయత్నమేమీ చేయలేదు. సానియా ఆ పని చేయడానికి డేటు కూడా దాటిపోయింది.

అయినప్పటికీ క్రీడా మంత్రిత్వ శాఖ స్వయంగా సానియా పేరును ఖేల్ రత్న పురస్కారానికి ప్రతిపాదించబోతున్నట్లు సమాచారం. హైదరాబాదీ టెన్నిస్ స్టార్ ఇటీవలే మార్టినా హింగిస్‌తో కలిసి ప్రతిష్టాత్మక వింబుల్డన్ మహిళల డబుల్స్ టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆమె డబుల్స్ లో ప్రపంచ నెంబర్ వన్ కూడా అయింది. ఈ ఘనతల్ని దృష్టిలో ఉంచుకుని సానియా పేరును ఖేల్ రత్న పురస్కారానికి ప్రతిపాదించనున్నారు. ఐతే మిగతా క్రీడలకు చెందిన చాలామంది స్వయంగా ఈ పురస్కారానికి దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధుతో పాటు దీపిక పల్లికల్ (స్క్వాష్), సీమా అంటిల్ (డిస్కస్ త్రో), వికాస్ గౌడ (డిస్కస్ త్రో), సర్దార్ సింగ్ (హాకీ), టింటు లూకా (అథ్లెటిక్స్), అభిషేక్ వర్మ (ఆర్చరీ), గిరీష (పారాలింపిక్ అథ్లెట్), జీవ్ మిల్కాసింగ్ (గోల్ఫ్) అవార్డు కోసం దరఖాస్తు పంపారు. మరి వీరందరినీ కాదని సానియానే ఖేల్ రత్నకు ఎంపిక చేస్తారేమో చూడాలి.