Begin typing your search above and press return to search.

ద్రవిడ్ ప్రత్యేకత అదే మరి..

By:  Tupaki Desk   |   18 July 2015 9:46 AM GMT
ద్రవిడ్ ప్రత్యేకత అదే మరి..
X
భారత క్రికెట్లో ఎందరో దిగ్గజాలున్నారు. నైపుణ్యం విషయంలో ఎవరు గొప్ప అంటే ముందుగా సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ పేర్లు వినిపించొచ్చు కానీ.. నైపుణ్యానికి కమిట్మెంట్ కూడా కలిపి చూస్తే మాత్రం రాహుల్ ద్రవిడ్ అందరికంటే ముందుంటాడు. ఆటలో కానీ.. మాటలో కానీ.. కమిట్మెంట్ విషయంలో ద్రవిడ్ తర్వాతే ఎవరైనా. సచిన్, గవాస్కర్, మిగతా వాళ్లు కమిట్మెంట్ లేని వాళ్లని కాదు.. కానీ ఈ విషయంలో ద్రవిడ్ మాత్రం వాళ్లందరికంటే ఓ మెట్టు పైనే ఉంటాడన్నది అతడి వ్యక్తిత్వం అర్థమైన ఎవరైనా ఒప్పుకునే సత్యం. ఆటగాడిగా ఉన్నపుడు భారత క్రికెట్ ప్రయోజనాల గురించే ఎప్పుడూ ఆలోచించిన ద్రవిడ్.. రిటైర్మెంట్ తర్వత కూడా ఆ కమిట్మెంటే చూపిస్తున్నాడు. బీసీసీఐ మంచి పదవులిస్తామని ఆశ చూపినా.. కావాలంటే టీమ్ ఇండియా కోచ్ పదవి చేపట్టమని అడిగినా ద్రవిడ్ ఒప్పుకోలేదు. వీటిలో కష్టం తక్కువ. ఆదాయం ఎక్కువ. కానీ ద్రవిడ్ మాత్రం అండర్-19, ఇండియా-ఎ జట్లకు కోచింగ్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఇది హై ప్రొఫైల్ జాబ్ కాదు. జీతం కూడా తక్కువే కావచ్చు. కానీ కుర్రాళ్లను తీర్చిదిద్దడం అనే గురుతరమైన బాధ్యత తనపై ఉంది కాబట్టి ద్రవిడ్ ఒప్పుకున్నాడు.

ఆ సంగతలా ఉంచితే ద్రవిడ్ మెంటార్ గా పని చేస్తున్న రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీపై రెండేళ్ల పాటు సస్పెన్షన్ పడింది. ఇంకెవరైనా అయితే.. ఇది దారుణం అంటారు. కానీ ద్రవిడ్ మాత్రం సుప్రీం కోర్టు నిర్ణయాన్ని ఓ ముందుడుగు అని చెప్పాడు. ఈ నిర్ణయాన్ని మేలుకొలుపుగా భావించి.. ఇకపై అప్రమత్తంగా ఉండాలన్నాడు. ఫ్రాంఛైజీల యజమానులు చేసిన తప్పిదానికి యువ ఆటగాళ్లు బలవడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. తన లాంటి మెంటార్ లు, కోచ్ లు, స్టార్ ఆటగాళ్లకు వచ్చిన ఇబ్బందేమీ లేదని.. వేరే ఫ్రాంఛైజీకి వెళ్లిపోవచ్చని.. కానీ లేక లేక అవకాశం దక్కించుకున్న యువ ఆటగాళ్లకే ఈ నిర్ణయం శరాఘాతమని.. అది తనకు చాలా బాధ కలిగిస్తోందని ద్రవిడ్ బాధపడ్డాడు. ఐతే ఎవరికెంత కష్టంగా ఉన్నా.. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశాడు ద్రవిడ్. ఆటకు చెడ్డపేరు తెచ్చేవాళ్ల విషయంలో అస్సలు ఉపేక్ష ఉండొద్దని.. ఇకపై అయినా ఇలాంటి తప్పులు జరగకుండా చూడాలని ద్రవిడ్ హితవు పలికాడు.