ఈ పాకిస్థాన్ ఆటగాళ్లకు ఏమైంది?

Thu Jul 23 2015 15:18:30 GMT+0530 (IST)

ప్రపంచ క్రికెట్లో విశ్లేషకుల అంచనాలకు అందని జట్టేదైనా ఉందంటే అది పాకిస్థాన్ మాత్రమే. ఒక రోజు ఎంతటి బలమైన జట్టునైనా ఓడించగలదు. మరుసటి రోజే ఓ చిన్న జట్టు చేతిలోనూ ఓడగలదు. ఎప్పుడెలా ఆడుతుందో చెప్పలేని అనిశ్చిత జట్టు అది. మొన్న వన్డే వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టు ఆట అందరికీ గుర్తుండే ఉంటుంది. వెస్టిండీస్ చేతిలో చిత్తుగా ఓడింది. యూఏఈ లాంటి జట్టు మీద ఆపసోపాలు పడి గెలిచింది. అతి కష్టం మీద క్వార్టర్స్ చేరి.. ఆ దశలోనే నిష్క్రమించింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లి మూడు వన్డేల సిరీస్ లో 0-3తో చిత్తు చిత్తయింది.  టీ20ల్లోనూ ఓడింది. అలాంటి జట్టు శ్రీలంకను శ్రీలంకలో టెస్టులు వన్డేలు రెండింట్లోనూ ఓడిస్తుందని అనుకుంటామా. ఇప్పుడదే జరిగింది.

మూడు టెస్టుల సిరీస్ ను 2-1తో గెలవడమే కాదు.. ఐదు వన్డేల సిరీస్ లో ఇంకో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో విజయం సాధించింది. శ్రీలంకను వేరే చోట్ల ఓడించడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ వారి గడ్డపై ఓడించడం అంత వీజీ కాదు. సొంతగడ్డపై అత్యంత భీకరంగా ఆడే జట్లలో శ్రీలంక ముందుంటుంది. వారి పిచ్ లు వేరే వాళ్లకు అర్థం కావు. పెద్ద పెద్ద జట్లు కూడా శ్రీలంకకు వెళ్తే చేదు అనుభవాలు తప్పవు. అలాంటిది బంగ్లాదేశ్ చేతిలో చిత్తయి వచ్చి వచ్చిన పాకిస్థాన్. శ్రీలంకను వారి గడ్డపై ఓడించడం పెద్ద సంచలనమే.అందులోనూ టెస్టు సిరీస్ ను గెలుచుకున్న తీరు కూడా అద్భుతం. మూడో టెస్టులో 377 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిందా జట్టు. వారికిదే హైయెస్ట్ ఛేజ్.
ఇప్పుడిక వన్డేల్లోనూ తిరుగులేని విజయాలు సాధించింది. పాకిస్థాన్ గెలవడం కంటే గెలుస్తున్న తీరే ఆశ్చర్యం కలిగిస్తోంది. తొలి వన్డేలో 256 పరుగుల లక్ష్యాన్ని ఇంకో ఐదు ఓవర్లుండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. రెండో వన్డేలో 2 వికెట్ల స్వల్ప తేడాతో ఓడినా.. మూడో వన్డేలో 135 భారీ తేడాతో విజయం సాధించింది. నాలుగో వన్డేలో 257 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 55 బంతులుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
 
నిజానికి పాకిస్థాన్ బ్యాటింగ్ చాలా వీక్. 250కి పైగా లక్ష్యం అంటే ముందే చేతులెత్తేస్తారు ఆ జట్టు బ్యాట్స్ మెన్. కానీ తాజా సిరీస్ లో మాత్రం చెలరేగి ఆడి పాక్ ను గెలిపించేస్తున్నారు. ఈ ప్రదర్శన చూసి పాకిస్థాన్ ను అతిగా ఊహించుకున్నా కష్టమే. తర్వాతి సిరీస్ లోనే మళ్లీ చతికిలబడ్డా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే అది పాకిస్థాన్.