Begin typing your search above and press return to search.

మన హాకీకి పట్టిన దరిద్రం వదిలేదెప్పుడు?

By:  Tupaki Desk   |   21 July 2015 9:25 AM GMT
మన హాకీకి పట్టిన దరిద్రం వదిలేదెప్పుడు?
X
మన జాతీయ క్రీడ హాకీ అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇప్పుడు క్రికెట్ అంటే ఎలా పడిచస్తున్నామో.. ఒకప్పుడు హాకీని కూడా అంతే ఆదరించాం. దేశంలో ఇప్పటికీ హాకీ ప్రియులకు కొదవలేదు. మన జట్టు బాగా ఆడితే.. కోట్లమంది కేరింతలు కొడుతూ చూస్తారు. మనవాళ్ల ప్రతిభ కూడా తక్కువేమీ కాదు. ఒకప్పుడు ప్రపంచానికే హాకీ నేర్పించిన ఘనత మనది. ఇప్పుడు మిగతా ప్రపంచమంతా ముందుకు వెళ్తుంటే మనం మాత్రం ఆటను భ్రష్టు పట్టించే వ్యవస్థను నెత్తిన పెట్టుకుని తిరోగమనం వైపు నడుస్తున్నాం. ఇంతకుముందు గిల్ అనే మహానుభావుడి నేతృత్వంలో ఇండియన్ హాకీ ఫెడరేషన్ మన హాకీని ఎంతగా నాశనం చేసిందో అందరికీ తెలిసిందే. ఆ గిల్ కు నచ్చినోడే జట్టులో ఉండాలి. ఆయన మెచ్చినవాడే కోచ్ పదవిలో ఉండాలి. ఇష్టం వచ్చినట్లు మార్పులు చేసి.. ఆటగాళ్ల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసి మన హాకీని నాశనం చేసిన ఘనత గిల్, ఇండియన్ హాకీ ఫెడరేషన్ లదే.

ఐతే ఐహెచ్ఎఫ్, గిల్ లను సాగనంపేసి.. హాకీ ఇండియా చేతికి పగ్గాలిచ్చింది కేంద్రం. మొదట్లో హాకీ ఇండియా బాగానే పని చేసింది. మన హాకీ జట్టు ప్రదర్శన కూడా మారింది. కానీ ఈ హాకీ ఇండియా కూడా ఐహెచ్ఎఫ్ కు ఏమాత్రం తీసిపోని విధంగా వ్యవహరిస్తోంది. దీని అధ్యక్షుడు నరిందర్ బత్రా భారత హాకీని భ్రష్టు పట్టించడానికి చేయాల్సిందంతా చేస్తున్నాడు. గత ఐదేళ్లలో భారత జట్టుకు ముగ్గురు కోచ్ లు మారడానికి బత్రానే కారణం. ఓ కోచ్ వచ్చి జట్టులో కుదురుకోవడానికి, ఆటగాళ్లు అతడితో సర్దుకుపోవడానికి ఏడాదైనా పడుతుంది. ఇలా ఓ కోచ్ కుదురుకోవడం.. జట్టు ప్రదర్శన కాస్త మెరుగవడం ఆలస్యం.. అతడిపై వేటు పడిపోతుంది. మళ్లీ మన జట్టు ప్రదర్శన యథా ప్రకారం తయారవుతుంది. ఐదు నెలల కింద పాల్ ఆస్ అనే న్యూజిలాండ్ కోచ్ భారత జట్టు బాధ్యతలు తీసుకున్నాడు. అతడి నేతృత్వంలో భారత హాకీ జట్టు మంచి ప్రదర్శనే చేస్తోంది. ఈ మధ్య హాకీ వరల్డ్ లీగ్ సెమీస్‌లో కూడా మంచి ప్రదర్శనే చేసింది. ఐతే ఆ టోర్నీలో ఓ మ్యాచ్ సందర్భంగా బత్రా నేరుగా మైదానంలోకి వచ్చి ఆటగాళ్లను తిడుతుంటే పాల్ ఆస్ అడ్డుకున్నాడట. మైదానంలోకి రావడానికి నీకేం అధికారం ఉంది అని ప్రశ్నించాడట. అంతే అయ్యగారికి ఇగో అడ్డొచ్చింది. ఫలితంగా పాల్ ఆస్ పై వేటు పడిపోయింది. ఒలింపిక్స్ కు ఏడాది కూడా వ్యవధి లేదు. ఇలాంటి సమయంలో జట్టుతో బాగా అలవాటు పడిన కోచ్ ను సాగనంపేశారు. ప్రస్తుతం జట్టు ప్రదర్శన చూస్తుంటే ఒలింపిక్ పతకం మీద ఆశలు రేగుతున్నాయి. కానీ ఇంతలోనే కోచ్ పై వేటుతో జట్టులో గందరగోళం సృష్టించారు. ఇప్పుడిక మళ్లీ కొత్త కోచ్ ను చూడాలి. అతను వచ్చి జట్టుతో కలిసిపోవడానికి చాలా టైం పడుతుంది. అతడి శైలి ఎలా ఉంటుందో? జట్టును అతనెలా మారుస్తాడో తెలియదు. ఇక మన జట్టు నుంచి ఎలాంటి ప్రదర్శన ఆశిస్తాం. ఇదీ మన హాకీ దౌర్భాగ్య పరిస్థితి. ఈ అధికారుల దరిద్రం మన హాకీని ఎప్పుడు వదులుతుందో ఏంటో!