Begin typing your search above and press return to search.

సచిన్ బతికిపోయాడు..ధోని దొరికిపోయాడు

By:  Tupaki Desk   |   11 Aug 2015 9:54 AM GMT
సచిన్ బతికిపోయాడు..ధోని దొరికిపోయాడు
X
సచిన్ బతికిపోయాడు.. ధోని దొరికిపోయాడు సెలబ్రెటీలకు కొన్నిసార్లు చిత్రమైన తలనొప్పులు వస్తుంటాయి. తమకు సంబంధం లేని వ్యవహారాల వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఐతే సెలెబ్రెటీ స్టేటస్ వల్ల పొందే లాభాలతో పాటు ఇలాంటి పరిణామాలకు కూడా సిద్ధంగా ఉండాల్సిందే. భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనిలకు వ్యతిరేకంగా ఇటీవల రెండు కేసులు నమోదైన సంగతి గుర్తుండే ఉంటుంది.

ముందుగా సచిన్ కేసు విషయానికొస్తే.. దాదాపు రెండేళ్ల క్రితం యూపీఏ సర్కారు అతడిని భారతరత్న పురస్కారానికి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘనత దక్కించుకున్న తొలి క్రీడాకారుడు సచినే. ఐతే భారతరత్న అయ్యాక కూడా సచిన్ ఒకప్పట్లాగే వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాడు. ప్రకటనల్లో కనిపిస్తున్నాడు. దీనిపై నస్వా ఓ వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశాడు. భారతరత్న ద్వారా వచ్చిన ఖ్యాతిని సచిన్ తన వ్యాపార, వాణిజ్య ఒప్పందాల కోసం.. ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాడని.. అయినా భారతరత్నకు ఎంపికైన వ్యక్తికి ఇలాంటి వ్యాపార, వాణిజ్య వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉండటం ఎంతవరకు సబబని.. కాబట్టి ఆ పురస్కారాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు నస్వా. ఐతే ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. ఇది తమ పరిధిలో అంశం కాదని.. కావాలంటే నేరుగా కేంద్ర ప్రభుత్వాన్నే ఈమేరకు విజ్నప్తి చేసుకోవచ్చని పేర్కొంది. హైకోర్టులో ఏమైనా తనకు వ్యతిరేకంగా తీర్పేమైనా వస్తుందేమో అని కొంత కంగారుపడిన సచిన్.. హైకోర్టు వ్యాఖ్యలతో ఊరట చెందాడు.

ఇక ధోని కేసు విషయానికొస్తే.. అతను ఓ యాడ్ కోసం విష్ణుమూర్తి అవతారంలో ఫొటోలకు పోజిచ్చాడు. అందులో చేతుల్లో బూటుతో సహా కొన్ని వస్తువులతో కనిపించాడు. ఈ ఫొటో తీవ్ర వివాదానికి దారి తీసింది. దీనిపై ఓ వ్యక్తి కేసు పెట్టాడు. బెంగళూరు హైకోర్టులో ఈ కేసు విచారణకు రాగా.. జడ్జి ధోనీకి హెచ్చరికలు జారీ చేశాడు. ‘‘ప్రజల మత విశ్వాసాలను గాయపరచడం వల్ల తలెత్తే పరిణామాల గురించి ప్రముఖుడైన ధోనికి తెలిసుండాలి. ఇలాంటి ప్రకటనలు చేస్తే ఏమవుతుందో తెలిసి ఉండాలి. ప్రముఖులు ఎలాంటి బాధ్యత లేకుండా ప్రకటనలు అంగీకరిస్తున్నారు. కేవలం డబ్బు కోసమే అలా చేస్తున్నారు’’ అంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయమూర్తి చర్యలేమీ ఆదేశించకున్నా.. ధోనిని తప్పుబట్టడం అతడికి ఇబ్బందికరమే.