Begin typing your search above and press return to search.

సంగక్కర కూడా ఆ లిస్టులోనే చేరతాడా?

By:  Tupaki Desk   |   12 Aug 2015 9:50 AM GMT
సంగక్కర కూడా ఆ లిస్టులోనే చేరతాడా?
X
అదేమిటో పాపం క్రికెట్లో దిగ్గజాలు చాలామందికి సరైన వీడ్కోలే దక్కదు. అప్పటిదాకా దేదీప్యమానంగా వెలిగిపోయిన కెరీర్ చరమాంకానికి వచ్చేసరికి మసకబారిపోతుంది. ఏళ్ల తరబడి ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యం చలాయించిన ఆటగాడు.. కెరీర్ ను ఘనంగా ముగించడంలో మాత్రం విఫలమవుతాడు. సచిన్ సహా చాలామంది దిగ్గజాల పరిస్థితి ఇంతే.

రెండు దశాబ్దాలకు పైగా ప్రపంచ క్రికెట్లో తన ఘనమైన ప్రస్థానాన్ని సాగించిన సచిన్.. చివరి రెండేళ్లు ఎంతగా ఇబ్బంది పడ్డాడో అందరికీ తెలిసిందే. అతడి అంతర్జాతీయ వందో శతకం కోసం ఏడాదికి పైగా ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. సచిన్ లాంటి ఆటగాడిని ఇంకా కొన్నేళ్లు ఆడు అనాల్సింది పోయి.. ఇంకెప్పుడు రిటైరవుతావు అనుకునేలా వైఫల్యాలు వెంటాడాయి. వెస్టిండీస్ తో ఆడిన చివరి సిరీస్ లోనూ భారీ స్కోర్లు చేయలేకపోయాడు. చివరి ఇన్నింగ్స్ లో 70 ప్లస్ స్కోరుతో పర్వాలేదనిపించాడు కానీ.. సెంచరీ అందుకోలేకపోయాడు. ఇక ద్రవిడ్, లక్ష్మణ్ ఇద్దరూ.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో ఘోర వైఫల్యం తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో నిష్క్రమించారు. గంగూలీ కూడా కెరీర్ చివర్లో అవమానాలు ఎదుర్కొన్నాడు. జయసూర్య, బ్రయాన్ లారా, రికీ పాంటింగ్, మహేల జయవర్దనే లాంటి దిగ్గజాలు కూడా కెరీర్ చరమాంకంలో చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు. వీళ్లెవరికీ కెరీర్ ను ఓ గొప్ప ఇన్నింగ్స్ తో ముగించాలన్న ఆశ తీరలేదు.

ఇప్పుడు కుమార సంగక్కర వంతొచ్చింది. కెరీర్ ఆసాంతం అతను ఎంత నిలకడగా ఆడాడో అందరికీ తెలిసిందే. కానీ రిటైర్ మెంట్ దగ్గరికొచ్చేసరికి పరిస్థితి తారుమారైంది. ఇటీవల పాకిస్థాన్ తో సిరీస్ లో సంగ విఫలమయ్యాడు. లంక సిరీస్ ఓడిపోయింది. ఇప్పుడు భారత్ తో మూడు టెస్టుల సిరీస్ రెండో మ్యాచ్ అనంతరం అతను క్రికెట్ కు గుడ్ బై చెప్పబోతున్నాడు. మరి తన చివరి రెండు టెస్టుల్లో సంగ ఎలా ఆడతాడా అన్న ఆసక్తి నెలకొంది. ఈ రెండు టెస్టుల్లో ఒక్క సెంచరీ అయినా చేస్తాడా.. జట్టును గెలిపిస్తాడా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఐతే తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 5 పరుగులకే వెనుదిరిగి నిరాశ పరిచాడు సంగ. అతడికి ఇంకో మూడు అవకాశాలున్నట్లు. మరి ఈ మూడు అవకాశాల్ని ఏమేరకు సద్వినియోగం చేసుకుంటాడో.. కెరీర్ ను ఎలా ముగిస్తాడో చూడాలి.