లంకపై అద్భుత విజయానికి రంగం సిద్ధం

Thu Aug 13 2015 20:19:44 GMT+0530 (IST)

22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే దిశగా విరాట్ కోహ్లి సేన తొలి అడుగు ఘనంగానే వేసింది. శ్రీలంకతో తొలి టెస్టులో టీమ్ ఇండియా విజయం లాంఛనమే. మూడు రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగించేలా కనిపిస్తోంది విరాట్ సేన. రెండో రోజుకే పరాజయపు కోరల్లో చిక్కుకున్నారు లంకేయులు. 192 పరుగుల భారీ లోటుతో గురువారం సాయంత్రం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక ఆట ముగిసే సమయానికి 4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 5 పరుగులు చేసింది. ఓపెనర్లు కరుణరత్నె కౌశల్ సిల్వా ఒక్క పరుగూ చేయకుండానే డకౌటయ్యారు. కరుణరత్నెను అశ్విన్ బౌల్డ్ చేయగా.. సిల్వాను అమిత్ మిశ్రా ఔట్ చేశాడు. సిల్వా కూడా బౌల్డే అయ్యాడు. సంగక్కర 1 పరుగుతో నైట్ వాచ్ మన్ దమ్మిక ప్రసాద్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. లంక ఇంకా 187 పరుగులు వెనుకబడి ఉన్న నేపథ్యంలో ఆ జట్టుకు ఘోర పరాజయం తప్పదనే అనిపిస్తోంది. భారత్ కు ఇన్నింగ్స్ విజయం దక్కినా దక్కొచ్చు. కెరీర్లో చివరి సిరీస్ ఆడుతున్న సంగక్కర... లంకకు పరాభవం తప్పించడానికి ఎలా పోరాడతాడో చూడాలి.

అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 128/2తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 375 పరుగులకు ఆలౌటైంది. 53 పరుగులతో ఉన్న ధావన్ 45 పరుగులతో ఉన్న కోహ్లి సెంచరీలు పూర్తి చేశారు. ధావన్ 271 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 134 పరుగులు చేయగా.. కోహ్లి 191 బంతుల్లో 11 ఫోర్లతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. వీళ్లిద్దరూ మూడో వికెట్ కు 227 పరుగులు జోడించడం విశేషం. వీళ్లిద్దరూ వెనుదిరిగాక భారత్ తడబడినా.. సాహా (60) రాణించడంతో భారత్ కు భారీ ఆధిక్యం దక్కింది. లోయరార్డర్ బ్యాట్స్ మెన్ తో కలిసి సాహా ఇన్నింగ్స్ నడిపించాడు. రహానె డకౌటయ్యాడు. హర్భజన్ 14 మిశ్రా 10 పరుగులు చేశారు. భారత ఇన్నింగ్స్ అయ్యాక నాలుగు ఓవర్లే సాధ్యమైనా.. అంత తక్కువ వ్యవధిలోనే భారత్ రెండు వికెట్లు పడగొట్టింది. పేసర్లను దించకుండా స్పిన్నర్లను ప్రయోగించి ఫలితం రాబట్టాడు కోహ్లి.