Begin typing your search above and press return to search.

కోర్టుకెక్కుతాం అంటున్న చెన్నై సూపర్‌‌కింగ్స్

By:  Tupaki Desk   |   15 July 2015 11:54 AM GMT
కోర్టుకెక్కుతాం అంటున్న చెన్నై సూపర్‌‌కింగ్స్
X
2013 ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణానికి సంబంధించి సుప్రీం కోర్టు నియమించిన లోధా కమిటీ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలపై రెండేళ్లు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ తీర్పుపై అప్పీల్ చేస్తామని అంటోంది చెన్నై సూపర్‌కింగ్స్.

ఐతే ఇది మిగతా కేసుల్లాంటిది కాదు. కింది కోర్టుల్లో విచారణ జరిగి.. ఆ తర్వాత పైకోర్టులకు వెళ్లి వ్యవహారం కాదు. బెట్టింగ్ కుంభకోణం బయటపడ్డాక బీసీసీఐ స్వయంగా ఓ విచారణ కమిటీ వేసింది. ఐతే ఆ కమిటీ ఏదో మొక్కుబడిగా విచారణ జరిపి.. గురునాథ్ మయప్పన్, రాజ్ కుంద్రాలు బెట్టింగ్‌కు పాల్పడినట్లు ఆధారాలు లేవని తేల్చేసింది.

ఐతే ఆ దశలో బీహార్ క్రికెట్ సంఘానికి చెందిన ఆదిత్య వర్మ అనే వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్లగా.. బీసీసీఐపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయి.. ఈ కేసు విచారణకు జస్టిస్ ముద్గల్ నేతృత్వంలో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది. దాదాపు ఏడాదిన్నర విచారణ జరిపిన ముద్గల్ కమిటీ.. గురునాథ్, రాజ్ కుంద్రాల్ని దోషులుగా తేల్చింది. చెన్నై, రాజస్థాన్ ఫ్రాంఛైజీల తప్పిదాల్ని ఎత్తి చూపింది.

ముద్గల్ కమిటీ నివేదిక అందాక.. దాని ఆధారంగా దోషులకు శిక్షలు ఖరారు చేయడానికి జస్టిస్ లోధా నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది సుప్రీం కోర్టు. ఆ సందర్భంగా ఈ కమిటీ నిర్ణయం అంతిమమని సుప్రీం కోర్టు చెప్పిన విషయం గమనార్హం. అంటే దీనిపై అప్పీల్‌కు అవకాశం లేదని అత్యున్నత న్యాయస్థానం చెప్పకనే చెప్పింది. ఐతే కొందరు న్యాయ నిపుణులు మాత్రం అప్పీల్‌కు అవకాశం ఉందంటున్నారు. అదే సమయంలో కేసు పూర్వాపరాల్ని పరిశీలించి.. అప్పీల్‌కు వెళ్లినా ప్రయోజనం ఉండకపోవచ్చని కూడా అంటున్నారు. మరి చెన్నై అప్పీల్‌ చేస్తే ఏమవుతుందో చూడాలి.