Begin typing your search above and press return to search.

ఒక విచిత్రం: దక్షిణాఫ్రికా తరఫున భారత ఫీల్డర్

By:  Tupaki Desk   |   10 Aug 2015 9:58 AM GMT
ఒక విచిత్రం: దక్షిణాఫ్రికా తరఫున భారత ఫీల్డర్
X
అది భారత్-ఎ, దక్షిణాఫ్రికా-ఎ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ మ్యాచ్. భారత్ బ్యాటింగ్ చేస్తోంది. దక్షిణాఫ్రికా ఫీల్డింగ్. మయాంక్ అగర్వాల్, ఉన్ముక్త్ చంద్ క్రీజులో ఉన్నారు. మయాంక్ షాట్ కొడితే ఫీల్డింగ్ లో బంతి అందుకున్నది మరో భారత ఆటగాడు మన్ దీప్ సింగ్. సడెన్ గా ఈ దృశ్యం చూస్తే ఎవ్వరికీ ఏం జరుగుతుందో అర్థం కాదేమో. కానీ దక్షిణాఫ్రికా తరఫున భారత ఆటగాడు ఫీల్డింగ్ చేసిన మాట వాస్తవం. అలాంటి పరిస్థితి రావడానికి దారితీసింది ముందు రోజు రాత్రి సఫారీ ఆటగాళ్లకు హోటల్లో పెట్టిన ఫుడ్డే. శనివారం రాత్రి దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు పెట్టిన భోజనంలో ఏదో తేడా వచ్చింది. ఫుడ్ పాయిజనింగ్ తో రాత్రంతా బాగా ఇబ్బంది పడ్డారు సఫారీ ఆటగాళ్లు. ఈ ఇబ్బందితోనే నలుగురు ఆటగాళ్లు ఆదివారం మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారు.

కానీ మైదానంలోకి వెళ్లాక తేడా కొట్టేసింది. ఒకరి తర్వాత ఒకరుగా ముగ్గురు మైదానాన్ని వీడారు. వాళ్ల కోసం సబ్ స్టిట్యూట్లను దించుదామంటే రిజర్వ్ బెంచ్ లో ఎవ్వరూ లేరు. కడుపులో తేడా కొట్టేసి ఆరుగురు ఆటగాళ్లు అప్పటికే ఆసుపత్రికి వెళ్లిపోయారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు వీడియో అనలిస్టును కూడా ఫీల్డింగ్ లోకి దించాల్సి వచ్చింది. అయినా సరిపోకపోవడంతో భారత ఆటగాడు మన్ దీప్ ను ఫీల్డింగ్ కు పంపించారు. ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన ఓపెనర్ డికాక్ కూడా ఆట ముగిశాక ఆసుపత్రికి పరుగెత్తాడు. మొత్తం పదిమంది ఆటగాళ్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అనారోగ్యంతో ప్రధాన బౌలర్లు మ్యాచ్ మధ్యలో నిష్క్రమించడంతో ఏదో పార్ట్ టైమ్ బౌలర్లతో బండి నడిపించింది సఫారీ జట్టు. దీంతో 245 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 37.4 ఓవర్లలో సునాయాసంగా ఛేదించింది భారత్. సోమవారం ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడాల్సిన దక్షిణాఫ్రికా మా వల్ల కాదు బాబోయ్ అంటే.. మంగళవారం మ్యాచ్ ఆడాల్సిన భారత్ ముందు రోజే కంగారూలతో తలపడుతోంది.