నీ ఏడుపేంది రైనా బాబూ..

Thu Jul 30 2015 14:57:32 GMT+0530 (IST)

సురేష్ రైనా అంతర్జాతీయ అరంగేట్రం చేసి పదేళ్లయిపోయింది. ఈ పదేళ్లలో 218 వన్డేలాడాడు. 44 టీ20లు కూడా ఆడాడు. ఈ రెండు ఫార్మాట్లలో చూస్తే ప్రస్తుతంలో జట్టులోని అత్యంత అనుభవజ్నులైన ఆటగాళ్లలో రైనా ఒకడు. టెస్టుల్లో కూడా రెగ్యులర్ ఆటగాడిగా ఉండి ఉంటే.. ఈపాటికి అతను వంద టెస్టులకు చేరువవుతూ ఉండాలి. కానీ ఇన్నేళ్లలో అతనాడింది 18 టెస్టులు మాత్రమే. ఈ పద్దెనిమిది టెస్టుల్లో అతను చేసిన పరుగులు 768 మాత్రమే. సగటు కేవలం 26.48. ఈ గణాంకాలు చూస్తేనే టెస్టు క్రికెట్లో రైనా పెద్ద ఫెయిల్యూర్ అన్న సంగతి అర్థమైపోతుంది. 18 టెస్టులు ఆడాడంటే అతడికి అవకాశాలు రాకపోలేదని కూడా అర్థం చేసుకోవచ్చు. కానీ టెస్టుల్లో తనకు సరైన అవకాశాలు రాలేదని.. అందుకే సత్తా నిరూపించుకోలేకపోయానని అంటున్నాడు రైనా.ఒకట్రెండు టెస్టుల్లో ఆడించి విఫలమవగానే తప్పించడం ఏం న్యాయమని.. తానేమీ ఐదు టెస్టుల సిరీస్ లో ఆడించమని అడగట్లేదని.. కానీ రెండు మూడు టెస్టుల్లో అయినా వరుసగా అవకాశాలిచ్చి.. అప్పుడు కూడా విఫలమైతే తప్పించాలని సవాలు విసురుతున్నాడు రైనా. ఐతే 2010లో అరంగేట్ర టెస్టులోనే సెంచరీ బాదిన రైనా.. ఏడాది పాటు టెస్టు జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు. కానీ తొలి టెస్టు సిరీస్ తర్వాత నాలుగు సిరీసుల్లోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడంతో అతణ్ని తప్పించారు. గత ఏడాది ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో ఈ బాబుకి వరుసగా నాలుగు టెస్టులాడే అవకాశం కల్పించారు. కానీ ఆ నాలుగు టెస్టుల్లో కలిపి చేసింది 105 పరుగులే. ఇప్పుడు రెండు మూడు టెస్టుల గురించి మాట్లాడుతున్న రైనా గత ఏడాది వరుసగా నాలుగు టెస్టుల్లో ఆడిస్తే ఏం చేశాడో చెప్పాలి. ప్రపంచకప్ కు ముందు ఆస్ట్రేలియాలో ఆడింది ఒకే టెస్టు కావచ్చు. కానీ రెండు ఇన్నింగ్సుల్లోనూ డకౌట్ కావడాన్ని ఏమనాలి? ఓ పాతికో యాభయ్యో కూడా చేయలేకపోయాడా? ఆడలేక మద్దెల దరువు అంటే ఇదేనేమో.