Begin typing your search above and press return to search.

క్రికెట్‌ చూస్తే.. ఈ సిరీసే చూడాలి

By:  Tupaki Desk   |   8 July 2015 10:28 AM GMT
క్రికెట్‌ చూస్తే.. ఈ సిరీసే చూడాలి
X
టీమ్‌ఇండియా ఎక్కడ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడినా.. అక్కడికెళ్లిపోయి మ్యాచ్‌ చూసే అభిమానులు కొందరు ఇప్పటికీ ఉండొచ్చు కానీ.. ఓ పదేళ్ల కిందటితో పోలిస్తే ఇప్పుడు క్రికెట్‌ చూడటం తగ్గిందన్నది వాస్తవం. దీనికి క్రికెట్‌ డోస్‌ పెరిగిపోవడం ఓ కారణం అని చెప్పొచ్చు. ఐపీఎల్‌ లాంటి టీ20 లీగ్‌లు వచ్చాక.. లెక్కలేనన్ని మ్యాచ్‌లు ఉంటున్నాయి. దీంతో ఒకప్పట్లా ఇండియా ఎప్పుడు సిరీస్‌ ఆడుతుందా అని ఎదురు చూసే పరిస్థితి లేదు. జనాల లైఫ్‌ స్టైల్‌ కూడా బిజీ అయిపోవడంతో అదే పనిగా క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటం తగ్గిపోయింది. ఆస్ట్రేలియాలో సిరీస్‌ జరుగుతుంటే తెల్లవారు జామునే లేచి తయారైపోవడం.. వెస్టిండీస్‌లో సిరీస్‌ అయితే.. అర్ధరాత్రి దాటాక కూడా మ్యాచ్‌లు చూస్తూ గడిపేయడం ఇప్పుడు తగ్గిపోయింది. ప్రపంచ క్రికెట్‌లో ఆ ఇంటెన్సిటీ, పోటీ తత్వం కూడా కొంతమేరకు తగ్గడం కూడా జనాల్లో ఆసక్తి సన్నగిల్లడానికి ఓ కారణం. పైగా ఇండియా, పాకిస్థాన్‌ జట్ల మధ్య తొమ్మిదేళ్లుగా సిరీస్‌లు లేకపోవడంతో జనాలు ఆసక్తికర పోరాటాలు మిస్సవుతున్నారు.

ఐతే ఇలాంటి సమయంలోనూ ఓ సిరీస్‌ అత్యంత ఆసక్తి రేపుతోంది. అదే.. యాషెస్‌. భారత్‌, పాకిస్థాన్‌ తలపడితే ఎంత కిక్కు ఉంటుందో.. దానికి ఏమాత్రం తక్కువ కాకుండా మజా ఉంటుంది ఈ సిరీస్‌. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ క్రికెటర్లు, అభిమానులు.. ఈ సిరీస్‌ను క్రికెట్‌ పోరులా కాకుండా ఓ యుద్ధంలా చూస్తారు. ప్రపంచకప్‌ కంటే కూడా వాళ్లు యాషెస్‌ సిరీస్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. మ్యాచ్‌లు ఎంత హోరాహోరీగా ఉంటాయో.. మైదానంలో మాటల యుద్ధాలు కూడా అంతే రంజుగా సాగుతాయి. ఈ సిరీస్‌ను ప్రతిష్టాత్మకంగా భావించే ఆటగాళ్లు.. తమ శక్తి సామర్థ్యాలను వంద శాతం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు. ఈ ఒక్క సిరీస్‌తో హీరోలు అయినవాళ్లూ ఉన్నారు. జీరోలు అయినోళ్లూ ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌ బుధవారమే మొదలవుతోంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ కార్డిఫ్‌లో జరుగుతోంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం మూడున్నరకు మ్యాచ్‌ మొదలు. ఇంగ్లాండ్‌లో జరిగిన గత మూడు యాషెస్‌ సిరీస్‌ల్లోనూ ఓడిన ఆస్ట్రేలియా.. ఈసారి కచ్చితంగా గెలవాలన్న పట్టుదలతో ఉంది. సిరీస్‌లో ఆ జట్టే ఫేవరెట్‌. పీటర్సన్‌ లాంటి స్టార్‌ ఆటగాడిని కోల్పోయిన ఇంగ్లాండ్‌.. కొంచెం బలహీనంగానే కనిపిస్తున్నా.. అంత తేలిగ్గా లొంగే ప్రసక్తి మాత్రం ఉండదు. కాబట్టి సిరీస్‌ హోరాహోరీగా సాగడం ఖాయమే.