మ్యాచ్ గెలిచినా ఆనందం లేదే..

Sat Aug 01 2015 15:32:04 GMT+0530 (IST)

యాషెస్ సిరీస్ లో మూడో టెస్టులో ఇంగ్లాండ్ తిరుగులేని విజయం సాధించింది. కేవలం రెండున్నర రోజుల్లోనే కంగారూల్ని మట్టికరిపించింది. ఐదు టెస్టుల సిరీస్ లో 2-1 ఆధిక్యం కూడా సంపాదించింది. కానీ ఇంగ్లాండ్ ఆటగాళ్లు మనస్ఫూర్తిగా ఈ విజయాన్ని ఆస్వాదించలేని పరిస్థితి. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిచినా.. తర్వాతి మ్యాచ్ ఓడిపోతామేమో అన్న కంగారే దీనికి కారణం. అయినా ఎప్పుడో జరిగే మ్యాచ్ లో ఓడిపోతామేమో అని.. ఇప్పుడే ఫిక్సయిపోవడమేంటి అని ఆశ్చర్యం కలగొచ్చు. ఐతే అండర్సన్ అనే ఫాస్ట్ బౌలర్ ఇంగ్లాండ్ కు ఎంత కీలకమో తెలిస్తే ఎవ్వరైనా ఆ జట్టు నాలుగో టెస్టులో గెలవడం కష్టమే అని ఒప్పుకుంటారు. పక్కటెముకల గాయం కారణంగా అండర్సన్ నాలుగో టెస్టుకు దూరమయ్యాడు.

రెండో టెస్టు రెండో రోజు గురువారం బౌలింగ్ చేస్తుండగా అండర్సన్ కు పక్కటెముకలు పట్టేశాయి. దీంతో అర్ధంతరంగా బౌలింగ్ నుంచి తప్పుకున్నాడు. ఆట ముగిశాక పరీక్షలు చేయిస్తే గాయం తీవ్రత తెలిసొచ్చింది. ఈ మ్యాచ్ లో మళ్లీ బౌలింగ్ చేయలేని పరిస్థితి. ఐతే అప్పటికే ఆస్ట్రేలియా పనైపోయింది కాబట్టి సమస్య లేదు. కానీ అండర్స్ రెండు వారాల పాటు ఆటకు దూరంగా ఉండాలని వైద్యులు తేల్చేయడంతో వచ్చే గురువారం ఆరంభమయ్యే నాలుగో టెస్టుకు అతడు దూరం కాక తప్పలేదు. 400కు పైగా టెస్టు వికెట్లు సాధించిన తొలి ఇంగ్లాండ్ బౌలర్ గా ఆ దేశ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా కీర్తి గడించిన అండర్సన్ ఆ జట్టు చాలా చాలా కీలకం. ఆస్ట్రేలియాతో పోలిస్తే అన్ని విభాగాల్లోనూ ఇంగ్లాండ్ బలహీనమే అయినా.. అండర్సన్ అద్భుత ప్రతిభతో సిరీస్ లో ముందంజ వేయగలిగింది. తొలి మూడో టెస్టుల్లో ఇంగ్లాండ్ విజయానికి బాటలు పరిచింది అతనే. అలాంటి బౌలర్ ను దూరం చేసుకోవడం ఇంగ్లాండ్ చాలా పెద్ద దెబ్బే. అతడి స్థానాన్ని ఎవరితో భర్తీ చేసినా కష్టమే. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ను మరో బౌలర్ అడ్డుకుంటాడని అనుకోలేం. కాబట్టి నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ గెలవడంపై ఇప్పుడే అనుమానాలు నెలకొన్నాయి.