Begin typing your search above and press return to search.

మరీ అంత రిస్కు అవసరమా ధోనీ?

By:  Tupaki Desk   |   8 Aug 2015 11:02 AM GMT
మరీ అంత రిస్కు అవసరమా ధోనీ?
X
పేరు వెనక డాక్టరేట్ ఉన్నవాళ్లందరూ డాక్టర్లు అయిపోతారా? గౌరవార్థం ఇచ్చే డాక్టరేట్ గౌరవ సూచకంగానే చూడాలి. అలాగే ఆర్మీ వాళ్లు క్రీడా ప్రముఖులకు కల్నల్ లాంటి గౌరవ హోదాలు ఇస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఐతే ఆ హోదా ఇచ్చారు కాబట్టి నిజమైన సైనికులు చేసే విన్యాసాలన్నీ చేయాలనుకోవడం రిస్క్ కదా. కానీ టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాత్రం అలాంటి రిస్కే చేయాలనుకుంటున్నాడు. సామాన్యులెవరూ చేయలేని సాహసానికి సిద్ధమవుతున్నాడు. అతడికి ఆర్మీ అధికారులు 2011లో ప్రపంచకప్ గెలిచిన అనంతరం కల్నల్ హోదా ఇచ్చిన సంగతి తెలిసిందే. క్రికెటర్ గా కెరీర్ ముగిశాక సైనికుడిగా దేశానికి సేవలందిస్తానని ముందే చెప్పిన ధోని.. ప్రస్తుతం ప్యారాచ్యూట్ వింగ్స్ బ్యాడ్జి సాధించాలన్న లక్ష్యంతో ఉన్నాడు.

ఐతే ఈ బ్యాడ్జి సాధించడం చిన్న విషయం కాదు. పది వేల అడుగుల ఎత్తులో దూసుకుపోతున్న యుద్ధ విమానం నుంచి ఐదుసార్లు ప్యారాచ్యూట్ జంప్ చేస్తేనే ఈ బ్యాడ్జి లభిస్తుంది. ప్రత్యేక శిక్షణ తీసుకున్నా.. సురక్షిత ప్రమాణాలు పాటించినా కొన్నిసార్లు పారాచ్యూట్ జంప్ ప్రమాదానికి దారి తీయొచ్చు. ఈ విషయమే ధోనికి చెప్పి అధికారులు అతణ్ని వారించారట. కానీ ధోని వింటే కదా. సాహసానికి సిద్ధమైపోయాడు. పారా రెజిమెంట్లో ధోని అధికారి కాబట్టి అతడి విజ్నప్తిని సైన్యాధికారులు అంగీకరించి తీరాలి. దీంతో ధోని సాహసానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆగ్రాలోని ఎలైట్ పారా రెజిమెంట్లో ధోని నిజమైన సైనికుడిలా శిక్షణ తీసుకుంటున్నాడు. రెండు వారాల ట్రైనింగ్ అనంతరం పారాచ్యూట్ జంప్ లో పాల్గొంటాడు ధోని. ఐదు జంపుల్లో నాలుగు పగలు చేస్తారు. ఒకటి రాత్రి చేయాలి. అదే అత్యంత రిస్క్ తో కూడుకున్నది. గతంలో కల్నల్ హోదా అందుకున్న ఏ క్రీడాకారుడూ చేయని విన్యాసానికి ధోని సిద్ధమవుతున్నాడు. అతడి ప్రయత్నం విజయవంతమవ్వాలని కోరుకుందాం.